fbpx

అర్హులైన జర్నలిస్టులకు సంతృప్త స్థాయిలో ఇళ్ల స్థలాలు

Share the content

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించే ఇళ్ల స్థలాల కోసం 23 నవంబర్, 2023న ప్రారంభమైన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 5,756 దరఖాస్తులు వచ్చాయని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జనవరి 6తో గడువు ముగుస్తున్నందున దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.అర్హులైన వారికి సంతృప్తస్థాయిలో ఇళ్ల స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ క్రింద ఇంటి స్థలాలను అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీ చేసిందని తెలిపారు.

జర్నలిస్టుల వివరాలను, వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ధృవీకరించి 4,742 మందితో కూడిన అర్హుల జాబితాను తదుపరి వెరిఫికేషన్ కోసం జిల్లాల కలెక్టర్ కు పంపించామన్నారు.
సరైన సమాచారం పొందుపరచని 935 మంది జర్నలిస్టుల దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత జర్నలిస్టులకు సందేశాలు ఇచ్చామని తెలిపారు. వివరాలు సరిచేసుకున్న అనంతరం దరఖాస్తులను వెరిఫై చేసి కలెక్టర్లకు పంపిస్తామని పేర్కొన్నారు.79 మంది జర్నలిస్టుల దరఖాస్తులు మాత్రమే ధృవీకరణ కోసం పెండింగ్ లో ఉన్నాయని, వాటి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఛైర్ పర్సన్ గా, జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి, డీఐపీఆర్వో,ముగ్గురు జర్నలిస్టులు సభ్యులుగా జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీని 26 జిల్లాలకు ఏర్పాటు చేశామని తెలిపారు. సంబంధిత కమిటీలు ఆయా జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు గుర్తించే ప్రక్రియ ప్రారంభించాయని తెలిపారు. రెవెన్యూ శాఖ వెరిఫికేషన్ చేసిన అనంతరం పూర్తిస్థాయిలో ఇళ్ల స్థలాలకు తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కేటాయించే ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ విలువ ప్రకారం 60 శాతం ప్రభుత్వం, 40 శాతం జర్నలిస్టులు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *