fbpx

జోగి × ఉప్పాల

Share the content

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ మీద తీవ్ర వ్యతిరేకత ఉండడం అవినీతి ఆరోపణలు అధికం కావడంతో అది సొంత పార్టీలోనే ప్రత్యర్ధులకు వరంగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పెడన నియోజకవర్గం సీటును జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక భర్త ఉప్పాల హరిబాబు కోరుతున్నారు. రాజకీయంగా చక్రం తిప్పగల ఉప్పాల హారిక మామ ఉప్పాల రాంప్రసాద్ సైతం రాష్ట్రస్థాయిలో దీనిపై ఇప్పటికే వైసీపీ పెద్దలతో మాట్లాడారు. ఇప్పటికే ఉప్పు నిప్పు అన్నట్లు ఉప్పాల కుటుంబీకులకు జోగి రమేష్ కకుటుంబానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల కుటుంబీకులు అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం అన్నది వైసీపీ ఓవర్గం అంచనా. గౌడ సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో చాలా సులభంగా ఉప్పాల కుటుంబం నెగ్గుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క జోగి రమేష్ కూడా తనకు టికెట్ ఇవ్వకుండా ఉండే అవకాశం లేదని బీసీ సామాజిక వర్గానికి తాను చెందుతాను కాబట్టి కచ్చితంగా అధిష్టానం నుంచి టికెట్ హామీ టికెట్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే జోగి రమేష్ మీద అవినీతి ఆరోపణలు అలాగే సొంత పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు అధికమైన నేపథ్యంలో ఎక్కడి నుంచి కొత్త ముఖం అయితే బాగుంటుందని వైసిపి పెద్దలు ఆలోచిస్తున్నారు.

టీడీపీ లోనూ అయోమయం

పెడన నియోజకవర్గం నుంచి టీడీపీలోను అయోమయం కొనసాగుతోంది. కాగిత వెంకట్రావు కొడుకు కాగిత కృష్ణ ప్రసాద్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కృష్ణ ప్రసాద్ తన పోటీకి సంబంధించి పూర్తిస్థాయి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మాజీ ఉపసభాపతి మండలి బుర్ధ ప్రసాద్ మాత్రం పెడన నుంచి పోటీ చేస్తానని టిడిపి అధిష్టానం నుంచి ఇప్పటికే హామీ దక్కిందని ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీలో అసలు ఏం జరుగుతుంది అన్నది మరో ప్రశ్నగా తయారైంది. ఇంకోపక్క ఈసారి మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి కాకుండా పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొనకళ్ళ నారాయణ పోటీలో ఉంటారు అన్న ప్రచారం కూడా జోరందుకుంది. అయితే ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని నారాయణకు టిడిపి అధిష్టానం మరోసారి మచిలీపట్నం నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జనసేన సైతం

మీడియా రంగం నుంచి గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీలో ఉన్న అంకేం ప్రసాద్ కూడా గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించారు. 17% ఓట్లు రాబట్టిన అంకెం ప్రసాద్ మళ్లీ జనసేన పార్టీ తరపున తన కార్యకలాపాలను నియోజకవర్గంలో విస్తృతం చేస్తున్నారు. కాపులు కచ్చితంగా ఈసారి జనసేన వైపు చూస్తున్నారు అనే కోణంతో పాటు కచ్చితంగా బీసీ వర్గాల ఓట్లను కనుక చేర్చగలిగితే జనసేన పార్టీ గెలుపు సాధ్యం అన్నది వారి అంచనా. దీనికి తగినట్లుగానే గ్రామ గ్రామాన జనసేన పార్టీని బలోపేతం చేసే చర్యలు జరుగుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పెడన నుంచి ఎవరికి టికెట్ కేటాయింపు ఉంటుంది ఎవరి గెలుపు సాధ్యం అనేది ఇప్పుడే చెప్పలేని పెద్ద సమాధానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *