fbpx

రాజధానిపై జగన్ ముఖ్య ప్రకటన

Share the content

ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పర్యటించనున్నారు. మూడు రాజధానుల ఎపిసోడ్ కొనసాగుతున్న సమయంలో అమరావతిలో ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తిగా మారుతోంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అమరావతి కేంద్రంగా సభలో సీఎం జగన్ పొల్గొంటున్నారు.
ఇందుకు ముహూర్తం ఖరారైంది. అమరావతికి తాను వ్యతిరేకమంటూ చేస్తున్న ప్రచారం పైన ఈ సభలో సీఎం స్పందించే అవకాశం ఉంది. తన ప్రణాళికలపైన కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

అమరావతిలో ముఖ్యమంత్రి :
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 26న అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలించారు. వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా సుమారు 20 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. తొలుత ఎర్రబాలెంలో పట్టాలకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించినా, అనువుగా లేకపోవటంతో ఈ ప్రాంతాన్ని ఖరారు చేసారు. ఈ సభా వేదికగా ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేయనున్నారు. బహిరంగసభలో ప్రసంగించనున్నారు.

పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ:

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా అమరావతిలో ఆర్ -5 జోన్ లో ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మందికి పట్టాల పంపిణీకి కార్యచరణ పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు విడతులగా భూ సమీకరణ చేసింది. దీని పైన స్థానికంగా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తొలుత హై కోర్టు, ఆ తరువాత సుప్రీంకోర్టులో ఈ వివాదానికి సంబంధించి విచారణ జరిగింది. ఇంటి స్థలాల పంపిణీకి తాజాగా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో హైకోర్టు తుది తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అమరావతిలో ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది.

సీఎం జగన్ క్లారిటీ ఇస్తారా..?

మాస్టర్ ప్లాన్ ను విధ్వంసం చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటు అమరావతి రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ సమయంలో ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ అమరావతి లో ముఖ్యమంత్రి జగన్ సభలో పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి జగన్ చేసే ప్రసంగం పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అమరావతి భవిష్యత్ పైన ఏం చెప్పబోతున్నారు… ఎటువంటి హామీలు ఇస్తారనేది కీలకంగా మారుతోంది.

చంద్రబాబు హాయంలో ఏం జరిగిందీ.. తమ ఆలోచనలు ఏంటనేది ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు సీఎం జగన్ అమరావతి సభ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *