fbpx

నాలుగో ఏడు చేదోడు.

Share the content

వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు కార్య‌క్ర‌మం గురువారం కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఏటా రూ.10 వేల ఆర్థికసాయం చేస్తూ ఈ నాలుగేళ్లలో ఈ పథకానికి రూ.1,252.52 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. జగనన్న చేదోడు పథకంలో 1.80 లక్షల మంది టైలర్లకు మంచి జరుగుతోందని, 1.45 లక్షల మంది నాయీబ్రహ్మణలకు, రజకులకు లబ్ధి చేకూరనుంది. వైసిపి ప్రభుత్వం వచ్చాక చేతి వృత్తదారులను ఆదుకునేందుకు చేదోడు కార్యక్రమం, వాహన మిత్ర, స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ప్రభుత్వం తోడు నిలుస్తుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది సహాయం అందించే కార్యక్రమం జరుగుతున్నది ఈ నాలుగేళ్ల పాలనలోనే అన్నది గమనించాలని సీఎం జగన్ అన్నారు. ఇదే వేదికపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పైవిమర్శలు గుప్పించారు.


చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మా వాడు అని చెప్పుకునే పరిస్థితి కూడా అక్కడ కనిపించదని సీఎం ఎద్దేవా చేశారు. కుప్పంలో పేదవాడికి ఇంటి స్థలం కావాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వలేకపోయాడని దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వం అక్షరాల 20 వేల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 8 వేల మందికి పక్కా ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టిందని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
“ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాటలు గుర్తున్నాయా? అప్పట్లో మీ ఇళ్లకు చంద్రబాబు, దత్తపుత్రుడి సంతకాలతో లెటర్లు తీసుకువచ్చారు. టీవీ అన్‌ చేస్తే చాలు..రూ.87612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనే మాటలు వినిపించాయి. చంద్రబాబు సీఎం అయ్యారు. రుణాలు మాఫీ దేవుడు ఎరుగు, అప్పటి దాకా రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ రుణాలను కూడా ఎత్తేసాడని. కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. సున్నా వడ్డీ పథకం రద్దు చేసి, బ్యాంకుల్లో బంగారం వేలం వేశారు”- అని సీఎం విమర్శించారు. అప్పటి పాలనకు, వైసీపీ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను గమనించాలని సీఎం కోరారు. ఎన్నికల మేనిఫెస్టోను అప్పట్లో చంద్రబాబు చెత్తబుట్టలో వేశాడని, కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వ మేనిఫెస్టోలో 99 శాతం వాగ్ధానాలు పూర్తి చేసి ప్రతి గడప వద్దకు మేనిఫెస్టోను తీసుకు వెళ్ళడం జరిగిందని సీఎం అన్నారు. గడప గడపకు వెళ్లి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటున్న మీ బిడ్డ పాలనను గమనించాలని సీఎం మరొక్కసారి కోరారు. రాజధాని భూములు నుంచి స్కీల్ స్కామ్ వరకు, ఫైబర్ గ్రిడ్ నుంచి మద్యం కొనుగోళ్ల వరకు చంద్రబాబు అన్నింటా దోచుకోవటమే అని ప్రతిపక్ష పార్టీలపై సీఎం జగన్ తనదైన శైలిలో మరొకసారి విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *