fbpx

అప్పట్లో ప్లస్.. ఇప్పుడు మైనస్..

Share the content

2019లో వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్ రెడ్డికి ఎంత ప్లస్ అయ్యిందో వచ్చే ఎన్నికల్లో అదే కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సిబిఐ కోర్టులో సమర్పిస్తున్నప్పుడు అఫడవిట్లలోని సమాచారం ఇప్పుడు కాక రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ప్రతిపక్షాలు ఎలాంటి దెబ్బ కొట్టాలని భావిస్తున్నాయో ఆ రకంగానే సిబిఐ వారికి దారి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.

అనూహ్యంగా జగన్ పేరు

ఇటీవల సిబిఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన తాజా అఫడివిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య గురించి ముందుగానే సమాచారం ఉందని చెప్పడమే కాకుండా సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పించింది. హత్య విషయం జగన్ రెడ్డికి ముందే తెలుసు అని, అలాగే హత్య కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న అవినాష్ రెడ్డి తో హత్యకు ముందు జగన్ రెడ్డి మాట్లాడి ఉండవచ్చని చెప్పడం ద్వారా కీలకమైన కేసులో సీఎం పేరు మొదటిసారి బయటకు వచ్చింది. దీంతోపాటు వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం, కేంద్ర పెద్దల్ని కలవడం కూడా ప్రతిపక్షాలకు ఒక మంచి ఆయుధంగా తయారైంది. కచ్చితంగా ఈ కేసు ఎలా ఉన్నప్పటికీ సమాధానం చెప్పుకునే పరిస్థితి సీఎం కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొదటిసారి ముఖ్యమంత్రి పేరు బయటికి రావడం హత్య కేసులో కీలకమైన ఆధారాలు దొరకడంతో ఈ కేసు మలుపు ఎటు తిరుగుతుందో అన్న బెంగ అందరిలో పట్టుకుంది.

వచ్చే ఎన్నికల్లో ప్రచారం వ్యూహం ఇదే

వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్ద ఓట్లు అడగడానికి ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిమీద వైసిపి ఇప్పటికీ ఒక నిర్దిష్టమైన దారిని వెతుక్కుంది. వచ్చే ఎన్నికలు పెత్తందారి వ్యక్తులకు పేదలకు మధ్య అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా వారిలో భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం, అలాగే జగన్ చెబుతున్నట్లు పెత్తందారి వ్యక్తులతో పోరాటం అన్నట్లుగా చూపించే ప్రక్రియ జోరుగా నడుస్తోంది. అయితే అదే సమయంలో ప్రతిపక్షాలకు కూడా బలమైన ప్రచార అస్త్రాలు జరుగుతున్నాయి. ఇంట్లోని వ్యక్తులనే హత్య చేయించిన వారు ప్రజల్ని ఎలా కాపాడతారంటూ ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి సిపిఐ వేస్తున్న అఫడవిట్లు కచ్చితంగా పనికొస్తాయి. దీంతో కచ్చితంగా ప్రజలకు ఏ విధంగా సీఎం సమాధానం చెప్తారు లేదా వైసిపి దీనిని ఏ విధంగా తిప్పి కొడుతోంది అన్నది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *