fbpx

చింతలపూడి సైకిల్ కదలదు.

Share the content

చింతలపూడి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఏటూ తేల్చకపోవడం, చివర్లో కొత్త వ్యక్తి తెరపైకి వస్తారనే సూచనలు ఇప్పుడు రాజకీయంగా కాకరేపుతోంది. చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన తర్వాత స్థానికంగా ఉన్న వారు ఇక్కడి నుంచి పోటీ చేయడం బాగా తగ్గిపోయింది. గతంలో కోటగిరి విద్యాధరరావు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఆయన తన హవా కొనసాగించారు.

1983లో ఎన్టీఆర్ హవాలోనూ కోటగిరి ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం చింతలపూడి నుంచే కొనసాగింది. అయితే చింతలపూడి ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత ఇక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గం మాలలకు, కొవ్వూరు నియోజకవర్గం మాదిగలకు కేటాయిస్తూ వస్తోంది. ఎస్సీ సామాజిక వర్గంలోని రెండు కీలకమైన సామాజిక వర్గాలకు ఈ రెండు నియోజకవర్గాలను కేటాయించారు. అయితే చింతలపూడి నియోజకవర్గం నుంచి మాత్రం కీలక నేతలుగా ఎవరూ ఎదగలేకపోయారు.

గతంలో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత చింతలపూడి నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో ఆమె ఆచంటలో పోటీ చేసిన ఆమెను రిజర్వుడు నియోజకవర్గం తీసుకొచ్చి గెలిపించారు. అప్పట్లోనే అక్కడ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న కర్రా రాజారావును ఆపి, పీతల సుజాతకు అవకాశం ఇచ్చారు. అనంతరం ఇంఛార్జిగా కర్రా రాజారావు కొనసాగి, కీలకంగా పనిచేశారు. అయితే ఇటీవల రాజారావు మరణించడంతో ఇప్పుడు పార్టీకి అక్కడి నుంచి ఖాళీ ఏర్పడింది. ఇంఛార్జి స్థానం ఖాళీ అయింది. దీంతో తెలుగుదేశం పార్టీలోని నేతల మధ్య ఇదీ చిచ్చు రేపింది. నేను ఇంఛార్జి అంటే నేను అనేలా నాయకులు గొడవలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు దీనిపై నేతలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. చింతలపూడికి ఎవరూ ఇంఛార్జిగా నియమించలేకపోయారు. మాజీ జడ్పీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, పీతల సుజాతలు ప్రస్తుతం అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరి మధ్య రోజురోజుకూ అంతరం పెరగడం తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని సరిగా వాడుకోవడంలో మాత్రం తెలుగుదేశం వెనుకబడుతోంది. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అంతరాలే అన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *