fbpx

జూనియర్ ను దూరం చేయడం కరెక్ట్ కాదు

Share the content

టీడీపీ కి కీలకమైన సమయాల్లో నందమూరి బాలకృష్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇప్పుడు టిడిపికి లేనిపోని తలనొప్పులను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. టిడిపి క్లిష్టకాలం నడుస్తున్న సమయంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిని కలుపుకు వెళ్లాల్సిన పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారా అనే అనుమానాన్ని సైతం ఇవి కలిగిస్తున్నాయి. హైదరాబాదులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఐ డోంట్ కేర్ బ్రదర్ అంటూ వ్యంగ్యంగా విచిత్రంగా సమాధానం చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా వెళ్లిపోయిందా అనే అనుమానం అందరిలో కలుగుతోంది.

రాజకీయాల్లో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం ప్రత్యేకం. అలా ప్రజలకు చూపిస్తూ దాగుడుమూతల ఆట ఆడే వారే నిజమైన రాజకీయ నాయకులు అవుతారు. మొదటినుంచి ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే అలవాటు ఉన్న నందమూరి బాలకృష్ణతో టిడిపిని నడిపిస్తే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ద్వారా టిడిపి శ్రేణుల్లో మానసిక ధైర్యం పోవడంతో పాటు టిడిపిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సైతం ఆ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది. టిడిపిలో ఇప్పటికీ ఎవరు అవునన్నా కాదన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది కనిపిస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా మౌనం వహించడంతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆయనపై కాస్త ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే నందమూరి కుటుంబం నుంచి కచ్చితంగా టిడిపి పగ్గాలు భవిష్యత్తులో చేపట్టబోయే నాయకుడు అంటూ గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ను బుజ్జగించి ఈ సమయంలో దగ్గర చేసుకోవలసిన తెలుగుదేశం పార్టీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అన్నట్లుగా నందమూరి కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ వ్యాఖ్యానించడం ఇప్పుడు ఇరు కుటుంబాలలోను చిచ్చురేపేదిగా కూడా కనిపిస్తోంది. కచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే అది ఆ పార్టీకి చాలా బలం అవుతుంది. అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దూరాన్ని పెంచేలా ఉన్నాయి తప్పితే.. ఏమాత్రం పనికి వచ్చేవి గా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతికూల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన తీరు మీద ఇప్పటికే ఆ పార్టీ శ్రేణుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే బాట పట్టి మద్దతు ప్రకటిస్తే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుండెల్లో పెట్టుకుంటారు అనడంలో ఏం సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *