fbpx

ఏపీలో బిజెపి జనసేన పొత్తు ఉన్నట్టా లేనట్టా…?

Share the content

ఎన్నిలకు మరో కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి వెళ్తాయని పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీని ఓడించడమే లక్ష్యమని, రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ, జనసేన పని చేస్తాయని స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య సీట్లు పంపకాలు, సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పటికే రెండు విడతల సమావేశం కూడా నిర్వహించారు. రాజకీయాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కమిటీ ఇప్పటికే సమావేశమై చర్చించింది. టీడీపీ, జనసేన కూటమి ఇప్పటికే మెజార్టీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ..2023 బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ పొత్తుల వ్యవహారం తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుందా లేదంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. టీడీపి,జనసేన కూటమితో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమతో ఎవరు కలిసి వచ్చినా వైసీపీ సర్కార్ పై ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అంటే బీజేపీ కూడా జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ఇస్తుందా ? మరి ఎలా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా టిడిపి తో సన్నీహితంగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కల్యాణ్ ఆంధ్రాలో కూడా పొత్తు కోరుకుంటున్నారు. ఈ విషయంపై మాత్రం బిజెపి కేంద్ర నేతలు నోరు మెదపటం లేదు. ట్రయాంగిల్ పొత్తు కుదిరితే ఒకే. లేదంటే టీడీపీ-జనసేన, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాల్సిందే. ఏపీలో జనసేన బిజెపి పొత్తు విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. బీజేపీతో పొత్తు గురించి జనసేన అంతగా స్పందించడం లేదు. పొత్తుల లెక్క ఇలా ఉంటే పురందేశ్వరి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన కలిసి రాకపోతే ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఒంటరి పోరు చేస్తామని చెప్పడం కరెక్ట్ కానీ, రాష్ట్రంలోని 175 సీట్లలో జనసేనకు అయినా అభ్యర్థులు దొరుకుతారు కానీ, బీజేపీ దొరుకుతారా ? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీసం 100 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా అని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. కష్టపడి వంద స్థానాల్లో పోటీ చేస్తే, గౌరవ ప్రదమైన స్థాయిలో ఓట్లు వస్తాయా ? అంటే బీజేపీ నేతల నుంచి సమాధానం రావడంలేదు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేకపోయినపుడు, ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడం దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోది. జనసేన లేకపోతే బీజేపీ పరిస్థితి దాదాపు జీరోనే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలమెంతో చూసుకోకుండా పురందేశ్వరి ప్రకటన చేశారన్న విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *