fbpx

ఎంపీ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్తలు

Share the content

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు గుర్రాలనే దించాలి అలాగే ఆర్థికంగా బలంగా ఉన్న వారిని ప్రోత్సహించాలి అనే కోణంలో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ చంద్రబాబు దానికి దీటుగా పారిశ్రామికవేత్తలను ఈసారి ఎంపీ అభ్యర్థులుగా రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. పాత మూస ధోరణికి భిన్నంగా ఈసారి చంద్రబాబు అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. లోకేష్ చెప్పిన విధంగానే చంద్రబాబు దాదాపు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంటు అభ్యర్థులుగా రంగంలోకి దిగే వారిపై ప్రత్యేకంగా దృష్టి నిలిపారు. పార్లమెంటు అభ్యర్థులుగా ఉన్నవారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లోని అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించుకునే స్థితిలో ఉండాలి అని టిడిపి అధినేత భావిస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఈసారి బైరా దిలీప్ ను, కాకినాడ లోక్సభ స్థానం నుంచి సానా సతీష్ బాబును రంగంలోకి దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ రెండు నియోజకవర్గాల్లో కీలకమైన రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా ఉన్న వీరిని ఎంపిక చేయడం ద్వారా కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా బలం చేకూరుతుంది అని భావిస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి చింతకాయల విజయ్ ను పోటీ చేయించాలని మొదటి నుంచి భావించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కి టిడిపి అధినేత చంద్రబాబు సైతం పిలిచి మరి ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. బైరా దిలీప్ అయితే కచ్చితంగా అక్కడి నుంచి విజయం సాధిస్తారని దీంతో పాటు దిలీప్ కు ఇటు మెగా కుటుంబంతోను ఇతర రాజకీయ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ ఫార్మా రంగాల్లో ముందున్న దిలీప్ కుమార్ గతంలో కేంద్ర ప్రభుత్వంలో సివిల్ సర్వీసులో కూడా పనిచేశారు. అతి తక్కువ కాలం సివిల్ సర్వీసు ఉద్యోగం చేసిన బైరా దిలీప్ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అక్కడ విజయం సాధించారు. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో బైరా దిలీప్ కు మంచి పరిచయాలు బంధుమిత్రులు అధికంగా ఉండడంతో ఆయనను ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయించేందుకు చంద్రబాబు ఒప్పించారు. దీంతో బైరా ఫౌండేషన్ తరపున దిలీప్ కుమార్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు అనకాపల్లి నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇక సాన సతీష్ బాబు సైతం కాకినాడ లోక్సభ సీటు నుంచి పోటీ చేసేందుకు ప్రత్యేకమైన టీమ్ రెడీ చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా సాన సతీష్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో అటువైపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని సతీష్ బాబు భావిస్తున్నారు. దీంతోపాటు కాకినాడ నియోజకవర్గం పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పరిస్థితిని సైతం సతీష్ బాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఈడి దాడుల్లో ఒక్కసారిగా సతీష్ బాబు పేరు అప్పట్లో బయటకు వచ్చింది. దాని తర్వాత కొన్ని రోజులపాటు చాలా సైలెంట్ గా ఉన్న సతీష్ బాబు తన స్వస్థలం కాకినాడ నుంచే రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాలని బలంగా భావిస్తున్నారు. కాకినాడ లోక్సభ నుంచి ఎన్నో పేర్లు వచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం సానా సతీష్ బాబు అయితే ఆర్థికంగాను సామాజికంగానూ అన్ని విధాలా బాగుంటుంది అని భావించి కాకినాడ లోక్సభ నుంచి ఆయనకు దాదాపు టికెట్ ఖరారు చేసినట్లే అని సమాచారం. దీంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో ఆయన కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలను పెంచారు. దీంతో ఈ రెండు కీలకమైన లోక్సభ స్థానాలకు వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు టిడిపి తరఫున రంగంలోకి దిగేందుకు సంసిద్ధం అవుతున్నారు. అధికారికంగా వీరిద్దరి పేర్లే త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *