fbpx

ఆ రెండు పార్టీ మధ్య జెంటిల్ మేన్ ఒప్పందం

Share the content

తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జెంటిల్ మేన్ ఒప్పందం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకున్నా ఇరు పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా ఉండాలని భావిస్తున్నాయి. ఉమ్మడి శత్రువు వైసీపీ మీద జరిపే పోరాటంలో ఇరు పార్టీలు ఒకరినొకరు అనుకుంటే కొత్త సమస్యలు వస్తాయని భావించి.. వైసీపీనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేయాలని భావిస్తున్నాయి. గతంలో ఉన్న ఏ విషయాన్ని తవ్వుకోకుండా, భవిష్యత్తు ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని భావిస్తున్నాయి. మొదటగా మీడియాలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాట్లాడుకోకుండా ఉండేందుకు అంగీకారం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అంతర్గతంగా కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీలు విమర్శలు చేసుకోవడం వల్ల వైసీపీకి కొత్త ఆయుధం ఇచ్చినట్లు ఉంటుందని, కేవలం ఎవరికి వారు పనిచేసుకుంటూ వైసీపీ ఓటమి లక్ష్యంగా ముందుకు సాగితేనే ప్రయోజనం ఉంటుందని టీడీపీ-జనసేన భావిస్తున్నాయి.


సోషల్ మీడియాలో ఆపడం సాధ్యమా..?
మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు తెలుగుదేశం పార్టీ కాస్త కంట్రోల్ చేసే తీరున్నప్పటికీ సోషల్ మీడియాలో పరిస్థితిని నియంత్రించడం సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా జనసేనతో పొత్తు లేదని తేలితే వెంటనే టీడీపీ శ్రేణులు జనసేన మీద, జనసేన పార్టీ నాయకులు టీడీపీ మీద బురద జల్లుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీల్లో కొందరు నాయకులు పరోక్షంగానూ కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు చేసుకుంటున్నారు. అయితే పొత్తు ఏ మాత్రం లేదని తేలినా, ఇరు పార్టీల నేతలు ఒకరిని మరొకరు అనుకోకుండా గుంభనంగా ఉండగలరా లేదా అనేది అర్ధం కావడం లేదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. మరోపక్క జనసేనకు మీడియా బలం లేదు. టీడీపీకి అనుకూల మీడియా జనసేనకు ఇస్తున్న కవరేజీ విషయంలోనూ ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. మరి దీనిని ఏ విధంగా అధిగమిస్తారనేది కీలకమే. ఇప్పటికే జనసేన నేతలు టీడీపీ సోషల్ మీడియా అనుసరిస్తున్న తీరు మీద గుర్రుగా ఉన్నారు. కొన్ని ఫేక్ అకౌంట్లను సృష్టించి మొత్తం పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా వార్ జరుగుతున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో వీటిని ఎలా సమన్వయం చేస్తారనేది అసలు ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *