fbpx

గన్నవరంలో బొమ్మ తిరగబడింది!

Share the content

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా రాజకీయాల్లో ఉండరు అంటారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో వైసిపి టికెట్ నుంచి పోటీ చేయాలని భావిస్తుంటే ఆయన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వంశీ వెళ్ళిపోయిన స్థానాన్ని అంటే టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. అంటే గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఇద్దరు మధ్య జరిగిన పోటీనే ఉంటుంది కానీ పార్టీలు మారుతాయి అని అర్థం అవుతుంది. ఐదేళ్లలో బొమ్మ తిరగబడడం అంటే ఇదే..

లోకేష్ సమక్షంలో టీడీపీలోకి రావడం ఖాయం

యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కార్యకర్తలతో సమావేశమైన యార్లగడ్డ వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. యువ గళం పాదయాత్రలో లోకేష్ సమక్షంలో యార్లగడ్డ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. గన్నవరం నుంచి వల్లభనేని వంశీకి దీటుగా కొన్ని పేర్లు ఇప్పటికే పరిశీలనలోకి వచ్చినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావు అయితే ఆర్థికంగా, సామాజికంగా వంశీని ఢీకొట్టగలరని దీంతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన సింపతి కూడా పనికి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి నమ్మి గెలిపించిన ప్రజలను వంశీ మోసం చేశారు అన్న ప్రచారం కూడా ఎన్నికల్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీంతో గన్నవరం టికెట్ దాదాపు యార్లగడ్డకు ఇచ్చేందుకు లోకేష్ అంగీకరించిన తర్వాతే వెంకటరావు పార్టీ మార్పు మీద నిర్ణయం తీసుకున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. బచ్చుల అర్జునుడు ఇటీవల చనిపోవడం అక్కడి టిడిపికి మరో అభ్యర్థి లేకపోవడంతో బయటనుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని మొదట భావించారు. అయితే అనుకోకుండా యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగరవేయడం ఆయన టిడిపిలోకి వచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేయడం తో ఆ నియోజకవర్గంలో యార్లగడ్డ అయితేనే కచ్చితంగా వంశీకి సరిపోగలరు అని టిడిపి భావిస్తోంది. దీంతో లోకేష్ సమక్షంలో త్వరలోనే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మార్పు చేయనున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఈ వింత పరిస్థితి నియోజకవర్గ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *