fbpx

అంతు పట్టని బాలినేని వైఖరి

Share the content

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ కదలికల మీద ఎప్పటి నుంచో సస్పెన్సు కొనసాగుతోంది. ఆయన సొంత పార్టీకి కాస్త దూరంగా జరుగుతున్న సంకేతాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ముఖ్యంగా క్యాబినెట్ వేస్తున్న తర్వాత బాలినేనికి మంత్రి పదవి తీసేయడంతో ఆయన జగన్ వైఖరి మీద పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. తర్వాత ఆయన రాజకీయ చర్యలు కూడా కాస్త విభిన్నంగా తయారయ్యాయి. వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను బాలినేని స్వచ్ఛందంగా తిరస్కరించి రాజీనామా చేశారు. అనంతరం ప్రకాశం జిల్లాలోనూ ఆయన అధికార పార్టీ కార్యకలపాల్లో పాల్గొనడం చాలా తక్కువగానే జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు ఇటు ముఖ్యమంత్రి జగన్ కు కూడా అంతు పట్టడం లేదు. పలుమార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడిన బాలినేని తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు మరోపక్క విపక్షాలైన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు సైతం బాలినేని మీద ఈగ వాలనివ్వకుండా చూసుకోవడం విశేషం.

ఎందుకు ఆ పార్టీలకు ప్రేమ

ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక నేత. వైయస్ జగన్ కుటుంబంతోను ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రకాశం జిల్లాలో బాలినేని చెప్పిందే వేదంలా సాగేది. అయితే వైఎస్ జగన్ కుటుంబంలోనే మరో కీలకమైన నేత వైవి సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లా వారే కావడం, సుబ్బారెడ్డి కి జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బాలేనేనికి నచ్చలేదు. టీటీడీ చైర్మన్ గా బాలినేని రెండోసారి అవకాశం ఇచ్చిన జగన్ మంత్రివర్గంలో మాత్రం తనను పక్కన పెట్టారు అన్న కోపం బాలినేనిలో ఎక్కువగా కనిపించింది. తర్వాత క్రమక్రమంగా అధికార పార్టీ పగ్గాల నుంచి మెల్లగా తప్పుకోవడం, వైసీపీలోని కీలకమైన పదవులకు రాజీనామా చేయడంతో బాలినేని రాజకీయంగా ఎటువైపు వెళ్ళనున్నారు అన్న అపోహలు చెలరేగాయి. దీనికి భిన్నంగా విపక్షాలు అయిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో బాలినేని ఏమీ అనకపోవడం ఆయనను వెనకేసుకురావడం, అవసరం మేరకు మద్దతు ఇచ్చేలా మాట్లాడడం వైసిపి నేతల్లోనూ అనుమానానికి బీజం వేసింది. ప్రతిసారి బాలినేని పార్టీ మారతారు అని ప్రచారం జోరందుకున్న సమయంలో స్వయంగా బాలినేని మీడియా ముందుకు వచ్చి అలాంటిది ఏమీ లేదు అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు విపక్షాలు ఎందుకు బాలినేని మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటున్నాయి అన్నది ఇప్పటికి వైసిపి శ్రేణులకు పెద్ద ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో బాలినేని చివరి నిమిషంలో అయినా పార్టీ మారతారు అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. కొన్ని మీడియా ఛానల్స్ లో వచ్చే ఎన్నికల్లో బాలినేని టిడిపి తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అని అప్పుడే ప్రచారం వేగం పుంజుకుంది. అయితే బాలినేని మాత్రం ఇలాంటివి ఏవి పట్టించుకోవడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *