fbpx

బిజెపి పెద్దల మాటలను ప్రజలు నమ్ముతారా?

Share the content

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు జగన్ ను తిడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విచిత్ర రాజకీయాలకు, విచిత్రమైన రాజకీయ వాతావరణానికి చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో విపక్ష పార్టీగా ఉన్న బిజెపి వైసిపి పాలనను తప్పు పడతుంటే దానికి మంత్రులు ఎవరి దగ్గర నుంచి సమాధానం రాలేదు గానీ ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడం కూడా ఒక విచిత్రం అని చెప్పొచ్చు. ఏకంగా బిజెపి తనకు కలిసి రాకపోయినా పర్వాలేదు అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం ద్వారా ఇప్పటివరకు బిజెపి పూర్తిస్థాయిలో సహకరించిందా అన్నది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండిపోయింది. రాష్ట్రంలో విపక్షంగా ఉన్న బిజెపి నాయకులు జగన్ విషయంలో ఏమాత్రం విమర్శలు చేయకపోవడానికి కారణం ఇదేనా అన్నది కూడా అంతు పట్టకుండా ఉంది. ఇప్పటికే బీజేపీలో కొందరు టిడిపి వైపు మరికొందరు జగన్ వైపు అన్నట్లుగా ఉందని, బిజెపి రాష్ట్ర నేతల్లో కనీసం ఐక్యత కొరవడిందని విమర్శలు వస్తున్నాయి. దీంతోపాటు రెండు వర్గాలుగా విడిపోయిన బిజెపి నేతలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని బిజెపితో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు. కేవలం కేంద్ర నాయకత్వాన్ని నమ్ముకుని మాత్రమే బిజెపితో పొత్తు కొనసాగిస్తున్నామని ఆయన కుండబద్దలు కొట్టారు. తాజాగా అమిత్ షా జెపి. నడ్డా వంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ జగన్ పరిపాలనను పూర్తిస్థాయిలో విమర్శించడం పట్ల కూడా ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుంది.

ఎందుకీ నాటకాలు?

వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో గెలిచిన 23 మంది ఎంపీల మద్దతును ఎప్పటికప్పుడు కేంద్రంలోని బిజెపికి పూర్తిస్థాయిలో సహకారం అందించింది. లోక్ సభ లో పెట్టిన ప్రతి బిల్లును వైసీపీ మద్దతు పలికింది. అలాగే అవసరం ఉన్న సమయంలో బిజెపి పెద్దలు ఏం చెప్పమంటే అది చెప్పేలా వైసీపీ ఎంపీలు నడుచుకున్నారు. ఎన్డీఏ పక్షాలు కూడా దగ్గరవ్వని విధంగా వైసిపి బిజెపికి దగ్గర అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పెద్దలు రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. అయితే ఈ రూటు మార్చిన వైనాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టిడిపి అనుకూల మీడియా దీనిని పూర్తిగా తప్పుపడుతోంది. ఇంతకాలం వైసిపికి బిజెపి అండ్డగా ఉండి

చివరి నిమిషంలో కొత్త నాటకానికి తెరతీసాయని మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోను ఏమీ మాట్లాడకుండా కేవలం జగన్ సర్కారును విమర్శిస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అన్నది తటస్థుల మాట. ఇప్పటివరకు వైసీపీకి అన్ని విధాల సహకరించి చివరి నిమిషంలో ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి మాత్రమే బిజెపి ఇలాంటి కుట్రలకు తెరతీసింది అన్నది సామాన్యుడి మాట. మరి ఎన్నికల్లో బిజెపి పన్నుతున్న వ్యూహానికి అంటున్న మాటలకు ఏపీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *