fbpx

రాజకీయ రణక్షేత్రం దెందులూరు

Share the content

దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకం. చంద్రబాబునాయుడు ఓడిపోయినా దెందులూరులో నేనే గెలుస్తాను అని అతి విశ్వాసానికి పోయి… నిలువునా చతికిల పడిన తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండటమే రాష్ట్రవ్యాప్తంగా ఈ నియోజకవర్గం నుంచి అంచనాలు పెంచుతోంది. దెందులూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంత ఓటర్లు ఉండటం కూడా మరో ముఖ్య కారణం. వరుసగా రెండుసార్లు ఎమ్మేల్యేగా పనిచేసిన చింతమనేని… తనకంటే చిన్నవాడు, తానే ఉద్యోగం ఇప్పించానని చెప్పుకునే అబ్బయ్యచౌదరి మీద ఓటమి తర్వాత చాలాకాలం నిర్వేదంలో ఉండిపోయారు. ఎన్నికల ముందు అతి విశ్వాసం… నిండుగా నిర్లక్ష్యం తోడు రాష్ట్ర వ్యాపిత జగన్ గాలిలో ఈ నియోజకవర్గంలో చింతమనేని కొట్టుకుపోయారు. మళ్లీ ఇక్కడ చింతమనేని వర్సస్ అబ్బయ్య చౌదరి మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం నిండుగా కనిపిస్తోంది.

బీసీ ఓట్లే ప్రధానం…

నియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎక్కువ. జనాభా కూడా వారే అధికం. అయితే ఈ నియోజకవర్గం నుంచి బీసీ నాయకులు మాత్రం గెలిచిన దాఖలాలు లేవు. మొదటి నుంచి కమ్మ సామాజికవర్గానిదే పైచేయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బంధువు అయిన గారపాటి సాంబశివరావుకు ఈ నియోజకవర్గంలో తిరుగులేకుండా పోయింది. ఒకప్పుడు ఆయన నియోజకవర్గం మీద పూర్తి పట్టును సాధించారు. అయితే తర్వాత మారిన పరిణామాలతో కమ్మ సామాజికవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ తెదేపా నుంచి వేగంగా ఎదిగారు. దీంతో 2009లో గారపాటిని కాదని చంద్రబాబు చింతమనేనికి టికెట్ కేటాయించడం అప్పట్లో సంచలనం. దీనికి తగినట్లుగానే ఆయన గెలిచారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ అనే కోణంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ అశోక్ గౌడ్ ను, 2014లో వైసీపీ బీసీ యాదవ సామాజికవర్గం నుంచి కారుమూరి నాగేశ్వరరావును ఇక్కడి నుంచి బరిలోకి దింపినా వారిద్దరూ ఓడిపోయారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గ పెద్దలు చెప్పిందే వేదం అనే కోణంలో ఇక్కడ రాజకీయం నడుస్తుంది. బీసీ జనాభా కూడా వారి మాట కాదనలేని పరిస్థితి ఉండటంతోనే ఈ నియోజకవర్గంలో అగ్రవర్ణ పెత్తనం సాగుతోంది. దీంతో బీసీల గెలుపు ఇక్కడి నుంచి సాధ్యం కావడం లేదన్నది రాజకీయవర్గాల మాట. బీసీ ఓటర్లు సుమారు 80 వేల మంది వరకు ఉంటారని ఓ అంచనా.

కొల్లేరు ఓటర్లు కీలకమే..

నియోజకవర్గంలో సుమారు 12 కొల్లేరు గ్రామాల వరకు నియోజకవర్గంలో ఉంటాయి. ఒకేమాట ఒకేబాటగా ఉంటారని పేరున్న కొల్లేరు ఓటర్ల తీర్పు కీలకం. బీసీ వడ్డెర సామాజికవర్గం ఓటర్లు కొల్లేరులో కీలకం. అయితే వారిని సమన్వయ పరిచే నాయకుల పెత్తనం అక్కడి ఓటర్లను ప్రభావితం చేస్తుంది. వారిని ఏ పార్టీ ప్రసన్నం చేసుకుంటే ఆ పార్టీకి తిరుగుండదు అనేలా పరిస్థితి మారుతుంది. రాజకీయాల్లో అప్పటి పరిస్థితిని బట్టి కొల్లేరు నాయకులు వారికి దన్నుగా ఉండటం, వారికి మద్దతు పలకడం ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ సారి వ్యూహంతో చింతమనేని

గతంలో ఉన్నట్లుగా కాకుండా గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని కొత్త వ్యూహంతో కనిపిస్తున్నారు. గతంలో పట్టించుకోలేదు అని పేరున్న నాయకులను సైతం కలుపుకువెళ్తూ, ప్రభుత్వ విధానాల మీద అదే స్థాయిలో పోరాడుతున్నారు. జిల్లాల విభజన అనంతరం ఏలూరు జిల్లాలో తెదేపాకు చింతమనేని ప్రధాన నాయకుడు అయ్యారు. దీంతో జిల్లాలోని ఇతర ప్రాంతాలను తిరుగుతూ జిల్లాస్థాయి నాయకులను కలుపుకెళ్తున్నారు. అలాగే గ్రామాల్లోనే కేడర్ ను బలోపేతం చేస్తున్నారు. చిన్నస్థాయి కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పలకరించడం ఎక్కువైంది. అన్నీ రకాల సామాజిక వర్గ పెద్దలను తరుచూ కలుస్తున్నారు. జనసేనతో తెదేపా పొత్తు ఉన్నా.. దెందులూరు సీటును తెదేపా తీసుకుంటుందని, చింతమనేని బరిలో నిలుస్తారని కేడర్ బలంగా చెబుతున్నారు. జనసేన మద్దతు వస్తే చింతమనేని పని సులువు అవుతుందన్నది కార్యకర్తల్లో విశ్వాసం కనిపిస్తోంది.

సంక్షేమ మంత్రంతో కొఠారు…

వైసీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే తన బలంగా ఎమ్మేల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ముందుకు వెళ్తున్నారు. ఇటీవల నియోజకవర్గానికి సీఎం జగన్ ను తీసుకురావడంతో ఆయన ఇమేజ్ పెరిగింది. దీంతో పాటు చింతమనేని ధీటుగా సమాధానం చెప్పే యువ నాయకుడిగా వైసీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ముందుంటారనే అభిప్రాయం ఉంది. దీంతో పాటు అధికార అండదండలతో కొల్లేరులోని కొన్ని చెరువులను తవ్వుకునేందుకు సైతం అబ్బయ్యచౌదరి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చిన అనుమతులు కూడా పనిచేశారు. ఇది కొల్లేరు నాయకులకు పనికొచ్చింది. ఇక ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందజేయడం… ఎప్పటికప్పుడు గ్రామాల్లో తిరగడంతో కచ్చితంగా అబ్బయ్యచౌదరి రెండో పర్యాయం కూడా గట్టిగా నిలబడేందుకు నిర్ణయించుకున్నారు.
పోలీసులకు తలనొప్పి
నియోజకవర్గం ఏలూరు జిల్లాలోనే అత్యంత సున్నింతమైంది. ముఖ్యంగా వైసీపీ, తెదేపా కార్యకర్తల మధ్య చిన్న విషయాలకు గొడవలు జరగడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అర్ధరాత్రి వేళల్లో గొడవలు జరుగుతున్నాయి. గ్రామాల్లో జనం సైతం రాజకీయ గొడవలకు సమిధలవుతున్నారు. దీంతో పోలీసులు సైతం ఇదెక్కడి గొడవ అని తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొలదీ ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని భయపడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *