fbpx

బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

Share the content

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి,జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు.రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి, జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని వ్యతిరేకిస్తూ … సిపియం, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును మంగళవారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ సదస్సులో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ …. ఆంధ్రప్రదేశ్‌కి కావల్సింది బటన్‌ కావని, అభివృద్ధికరమైన అసమానతలు లేని ప్రజా ప్రణాళిక అవసరమన్నారు. అలాంటి ప్రణాళికను కేవలం వామపక్షాలు మాత్రమే ఇవ్వగలవని స్పష్టం చేశారు. కార్పొరేట్లు ఎన్నికల బాండ్లు అంటూ.. కొన్ని వేల కోట్ల రూపాయలను బిజెపికి పంపారని గుర్తు చేశారు. 90 శాతం దొంగడబ్బును బిజెపినే మింగేసిందని విమర్శించారు.

ఈ దేశంలో కార్పొరేట్ల డబ్బు తీసుకోకుండా ఉన్న పార్టీలు కేవలం వామపక్షాలేనని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ నిధులు తీసుకోనివారు మాత్రమే ప్రజలకు సేవ చేయగలరని చెప్పారు. ఎన్నికల వేళ … గవర్నమెంట్‌ డబ్బులను రూ.10 ప్రజలకు పంపిణీ చేసి ఈ డబ్బంతా తనదేనంటూ ప్రజలను సిఎం జగన్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆ డబ్బులో 90 శాతం జగనే మింగేస్తున్నారని అన్నారు. అయితే తెలుగుదేశంవారు తాము అధికారంలోకి వస్తే రూ.15 ఇస్తామని పోటీపడుతున్నారని.. కానీ మిగతా రూ.85, రూ.90 గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని.. అదంతా వాళ్ల జేబుల్లోకి పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల వద్ద నుండి నిధులను వసూలు చేస్తున్నది కేవలం కమ్యూనిస్టు పార్టీనేనన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం.. నిధులివ్వండి అని అడగగలిగాం… ఆ దమ్ము ఏ పార్టీకైనా ఉందా ? అని ప్రశ్నించారు.

ప్రజలిచ్చిన నిధులతోనే తాము పనిచేస్తామని తెలిపారు. తామేమీ ఓట్లను కొనబోమని, అమ్ముడుపోబోమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలను కొనగలిగే శక్తి ఈ భూప్రపంచంలో ఎవ్వరికీ లేదన్నారు. మోడి పల్లకిని మోసే అధికార, ప్రతిపక్ష పార్టీలకు అధికార కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. రాష్ట్రానికి మోడి చేస్తున్న ద్రోహం కనిపిస్తున్నా కానీ చంద్రబాబు ఏమాత్రం ప్రశ్నించలేదని అన్నారు. జగన్‌, చంద్రబాబులిద్దరూ ఢిల్లీకి మాటిమాటికీ పరుగెత్తడమే తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోరని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడి, అమిత్‌ షాలను వారు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.ఈ సదస్సులో…సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఐ(యం) కేంద్రకమిటీ సభ్యులు గఫూర్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్‌ – ఎస్‌కెఎం, చలసాని శ్రీనివాస్‌, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ,వి.వి.లక్ష్మీనారాయణ, అధ్యక్షులు జైభారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్‌. విద్యాసాగర్‌, రాష్ట్ర కార్యదర్శి విసికె పార్టీ,ఆప్‌, ఆర్‌పిఐ, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌, సమాజ్‌వాది పార్టీల నాయకులు మరియు సంఘాల, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *