fbpx

మతం పేరుతో మోసం చేసేందుకు రాముడి తో వస్తున్న మోదీ, అమిత్ షా : అక్కినేని వనజ

Share the content

దేశంలో మతం పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, రాముడిని అడ్డం పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. సోమవారం కాకినాడ సీపీఐ కార్యాలయము వద్ద జిల్లా సమితి సమావేశము చింతలపూడి సునీల్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరుయిన అక్కినేని వనజ మాట్లాడుతూ …ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయం పేరుతో అక్షింతలను దేశ ప్రజలకు పంపిస్తున్నారని.. ఆయనకు అక్షింతలు వేసే సమయం దగ్గర పడిందని ఎద్దేవా చేశారు.వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపిని..రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

పరిపాలన గాలికి వదిలి…సీట్లపై దృష్టి పెట్టిన జగన్
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీద ఉద్యమాలు నిర్వహిస్తుంటే.. ముఖ్యమంత్రి పరిపాలనను గాలికి వదిలేసారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో అంగన్వాడీలు, కార్మిక సంఘాలు మున్సిపల్ కార్మికులు, సమ్మె చేస్తుంటే సీఎం పరిపాలన గాలికి వదిలేసారని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలన్నిటిని గాలికి వదిలేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యేల బదిలిలకే జగన్ పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పేరుతో ఋషికొండకు గుండు కొట్టించారని..రూ.451 కోట్ల రూపాయలతో విశాలమైన భవంతిని నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి.. అంగన్వాడీ వర్కర్లకు మున్సిపల్ కార్మికులకు కనీస గౌరవ వేతనం ఇవ్వకపోవడం సరికాదన్నారు.వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై మీడియా తో కూడా మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డికి ఒక క్షణం కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత లేదన్నారు.

టిడిపితో కలిసి వెళ్లేందుకు సిద్ధం…. కానీ..
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తాము ముందుగా తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తులో వెళ్లాలని భావించామని అయితే తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపితో పయనించడానికి సిద్ధమవుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో తమ పార్టీ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పొత్తుల అంశం లో బిజెపి, వైసిపి తో కలవని రాజకీయ పార్టీలతో ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబును 51 రోజులు జైల్లో పెట్టించిన బిజెపితో కలవాలన్న ఆలోచనను పునారాలోచన చేసుకోవాలంటూ సూచన చేశారు. పొత్తులపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి లు కుండ్రపు రాంబాబు, రేఖ భాస్కరావు నగర కార్యదర్శి కొండలరావు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *