fbpx

వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

Share the content

వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఆదివారం విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడేనని, నాణ్యమైన, సరైన పరిమాణంలో సరసమైన ధరలకు వస్తువులు పొందే హక్కు వినియోగదారునికి ఉందన్నారు. 6,000 పాఠశాలలు, 500 ఇంటర్మీడియట్ కళాశాలలు, 175 డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్ లు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు కొన్న ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించాలని, మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు, పొందిన సేవలకు తప్పనిసరి బిల్లులు పొందాలని సూచించారు. డిజిటల్ యుగంలో వినియోగదార్ల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక సవరణలతో “వినియోగదారుల పరిరక్షణ కోసం -2019” తీసుకొచ్చిందన్నారు.

వినియోగదారులు ఏదైనా వస్తువును ఏ ప్రాంతంలో కొనుగోలు చేసినా స్థానిక జిల్లా కమిషన్ లోనే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటుతో పాటు విచారణ కోసం నేరుగా వినియోగదారుల కమిషన్ లకు రాలేని ఫిర్యాదుదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనే సౌలభ్యాన్ని కల్పించేలా చట్ట సవరణ చేశామన్నారు. వస్తువు నాణ్యతలో, పరిమాణంలో తేడాలుంటే ఇంటి నుండే ఆన్ లైన్ ద్వారా కేసు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు.డిజిటల్ యుగంలో పెట్రోల్ బంక్ లు, మాల్స్, వేబ్రిడ్జి, ఎరువుల షాపులు, స్వీట్ షాపులు, బంగారం కొట్లు, గ్యాస్ గోడౌన్ లు తదితర వాటిల్లో జరుగుతున్న వాటిపై నిఘా ఉంచి 4 కోట్ల 52 లక్షల జరిమానా విధించి సంబంధిత బాధితులకు అందజేశామన్నారు. ఫోన్ లకు వచ్చే ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని, ఓటీపీ చోరీ చేసే ముఠాపై నిఘాపెట్టామన్నారు. ఇప్పటికే చాలా కేసుల్లో పలువురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా తణుకులో పదకొండున్నర కేజీల బంగారం చోరీ అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ గ్యాంగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సినీ ఫక్కీలో చాకచక్యంగా పట్టుకొని రికవరీ చేసిన విధానాన్ని వివరించారు.రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖను బలోపేతం చేశామని తెలిపారు. వినియోగదారులకు, వర్తకదారులకు వారథిగా ఉన్న కన్య్జూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ను,వారి సేవలను ఈ సందర్భంగా మంత్రి అభినందిస్తూ కొనియాడారు. లీగల్ అండ్ మెట్రాలజీ, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించేందుకు త్వరలో ఒక బృందాన్ని ఏర్పాటుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.

  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలు, హక్కులపై వినియోగదారులకు అవగాహన తప్పనిసరన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా, నేరుగా ఉపయోగపడే శాఖ పౌర సరఫరాల శాఖ అని తెలిపారు. ఈ శాఖ బలోపేతం కోసం ముఖ్యమంత్రి అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. బ్లాక్ మార్కెట్ నిర్మూలనకు, ధరలను అదుపులో ఉంచేందుకు ఈ శాఖ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. * రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల చట్టంపై అవగాహన లేకపోవడం వల్లే మోసాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్క వినియోదారుడికి చట్టం, హక్కులపై అవగాహన ఉంటే వజ్రాయుధంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న విలేజ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు ఈ అంశంపై అవగాహన కల్పించి తద్వారా వినియోగదారులకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగదారులకు హక్కులు, అవగాహన కల్పించే విషయానికి సంబంధించి ఇటీవల వైజాగ్ లో నిర్వహించిన కన్జ్యూమర్ నేషనల్ కాంక్లేవ్ లో పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కితాబిచ్చారన్నారు.
  • ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ కు చెందిన విద్యార్థినులు స్కిట్ రూపంలో ప్రదర్శించిన తీరు ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, శాఖ సాధించిన విజయాలు గూర్చిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ ద్వారా ద్వారా రూపొందించిన మేలుకొలుపు మాసపత్రికను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఇతర అతిథులు కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు నిర్వహించిన క్విజ్‌, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి రావు,రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, డైరెక్టర్, ఐఏఎస్ ఎం. విజయ సునీత, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు ఎన్. చిరంజీవి, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *