fbpx

అయోమయంలో జేడీ!

Share the content

ఒకప్పుడు జగన్ అవినీతి కేసుల్లో ఆయనను అరెస్టు చేసి అందరితో హీరో అనిపించుకున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా తయారైంది. యువతలో మంచి క్లీన్ ఇమేజ్ ను మూట కట్టుకున్న ఆయన రాజకీయంగా వేసిన అడుగులు ఎందుకో మొదటే తడబడ్డాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీలో నిలిచిన లక్ష్మీనారాయణ మంచి ఓటింగ్ శాతం రాబట్టారు. జనసేన పార్టీలో రాజకీయ అడుగులు వేసిన లక్ష్మీనారాయణ లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం కంటే మంచి ఓట్లను సాధించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన గాజువాకలో పవన్ కళ్యాణ్ కంటే లక్ష్మీనారాయణకి అధికంగా ఓట్లు పడ్డాయి. విశాఖపట్నం ప్రజలు తనను అద్భుతంగా ఆదరించారని ఎన్నికల అనంతరం కూడా వ్యాఖ్యానించిన లక్ష్మీనారాయణ తర్వాత అనూహ్యంగా జనసేన పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని పూర్తిస్థాయి రాజకీయాలు చేయాలంటే సినిమాలను వదిలేయడం మంచిది అన్న అభిప్రాయంతో జనసేన పార్టీకి ఆయన రాజీనామా చేశారు. జనసేన పార్టీ రాజీనామా అనంతరం లక్ష్మీనారాయణ వేచి చూసే ధోరణి లోనే ఉండిపోయారు తప్ప మరే రాజకీయ పార్టీలోనూ చేరలేదు. పొలంబడి కార్యక్రమాలతో పాటు రైతులను కలుసుకునేందుకు ఆయన ఎక్కువ సమయం వెచ్చించారు. రాజకీయ కార్యకలాపాల్లోనూ ఆయన పాల్గొన్నది తక్కువే. కేవలం తన అభిప్రాయాలను పంచుకునేందుకు ఇంటర్వ్యూలు అలాగే ప్రచారం మాధ్యమాలను వాడుకోవడం తప్పితే రాజకీయంగా ఎలాంటి స్టెప్పు ను లక్ష్మీనారాయణ తీసుకోలేకపోయారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని ఇప్పటికే లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ స్వతహాగా రాయలసీమకు చెందిన వారు. కర్నూలు జిల్లా మూలాలు ఉన్నప్పటికీ జనసేన పార్టీలో చేరిన తర్వాత అధినేత సలహా మేరకు విశాఖ నుంచి ఆయన పోటీలో నిలవాల్సి వచ్చింది. దీంతో పాటు విశాఖ ప్రజలు ఆయన పై చూపిన అభిమానం తర్వాత మళ్లీ విశాఖ నుంచి పోటీ చేస్తానని అప్పట్లోనే చెప్పారు. దీనిలో భాగంగా ఆయన విశాఖకు మాకం మార్చారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం పరిధిలో బరిలో నిలుస్తానని ఇప్పటికే తేల్చి చెప్పిన లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి బరిలో నిలుస్తారు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని చెబుతూనే మరోపక్క స్వతంత్రంగా కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది అని చెప్పడం ద్వారా ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్న దానికి బలం చేకూరుతోంది. వచ్చే ఎన్నికల్లో లక్ష్మీనారాయణ విశాఖపట్నం నుంచి ఏ పార్టీ నుంచి బరిలో నిలుస్తారు అన్నదానిమీద ఇప్పటికీ ఆయనకు గాని ఆయనను అభిమానించేవారికి గాని స్పష్టత లేదు. జనసేన పార్టీలోకి మళ్లీ వెళ్తారని భావించినప్పటికీ ఆయన మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ కేవలం ఎన్నికల గురించి పార్టీలోకి వచ్చేవారిని తాను పెద్దగా పట్టించుకోనని చెప్పడం ద్వారా ఆ పార్టీలోకి లక్ష్మీనారాయణ ను మళ్లీ తిరిగి ఆహ్వానిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. అలాకాకుంటే తెలుగుదేశం పార్టీలోకి జేడీ లక్ష్మీనారాయణ వెళ్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారుతుంది. గతంలోనే లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఉంది అనేది తెలిసిన విషయమే. అయితే లక్ష్మీనారాయణ మాత్రం దాని మీద పెద్దగా స్పందించలేదు. సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలోకి చేరుతానని గతంలో లక్ష్మీనారాయణ చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ చేరితే పాత తరం సిద్ధాంతాలను మళ్లీ అదే పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఆయనతోపాటు ఆయనను అభిమానించే యువతకు కూడా సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. దీంతోనే జేడి లక్ష్మీనారాయణ ఎటు తేల్చుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీకి సంసిద్ధంగా ఉన్నప్పటికీ ఏ పార్టీలో చేరాలి అన్నది మాత్రం ఆయన నిర్ణయించుకోలేకపోతున్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తే ఓట్ల శాతాన్ని రాబట్టవచ్చు కానీ గెలుపు అనేది దాదాపు అసాధ్యమని లక్ష్మీనారాయణకు తెలుసు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అన్న దానిమీద మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ మళ్లీ జనసేన తరఫున పోటీలో నిలిస్తే మాత్రం జనసేన పార్టీకి లాభం లక్ష్మీనారాయణకు లాభం. కచ్చితంగా విశాఖలో ఇది ఒక ప్రభంజనం అయ్యే అవకాశం మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *