fbpx

చెవిరెడ్డికి బంపర్ ఆఫర్

Share the content

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల హేమాహేమీల కొడుకులకే టికెట్ ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పేసిన ముఖ్యమంత్రి జగన్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు బరిలో ఉండవని, కొడుకు మోహిత్ రెడ్డి కి టికెట్ ఇస్తామని, నువ్వు నా వెనకే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ చెవిరెడ్డికి చెప్పడం ఆ వెంటనే చెవిరెడ్డి కూడా నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తన కొడుకుని గెలిపించాలని కోరడం జరిగిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెవిరెడ్డికి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటో ఇతర పార్టీ నేతలకు అర్థం కాకుండా మిగిలిపోయింది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వద్దని తమ కొడుకులకు ఇవ్వాలని కోరుతున్న నేతలు జగన్ చెప్పిన మాటలకు అవాక్కయ్యారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి తన వెనుకే తిరగాలని, కాబట్టి ఆయన కొడుకు మోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తున్నట్లు జగన్ అందరిలోనూ ప్రకటించారు. చెవిరెడ్డి చేసే పనులే తాము కూడా చేస్తామని తమ కొడుకులకు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని నేతల పట్టుబడుతున్న ముఖ్యమంత్రి వాటిని అసలు చెవికి ఎక్కించుకోవడం లేదు. దీంతో చాలామంది వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపాలని, భావిస్తున్నప్పటికీ చెవిరెడ్డికి మాత్రమే ఏకంగా ముఖ్యమంత్రి నోటి ద్వారా తన కొడుకుకి టికెట్ ఇప్పించుకున్న అదృష్టం దక్కింది.

ఎందుకీ ప్రేమ

చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండోసారి చంద్రగిరి నుంచి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంటుంది. వరుసగా రెండుసార్లు గెలిచిన చెవిరెడ్డి కచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. దీనికి ఆయన చేసిన ప్రయత్నాలు తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. వైయస్ కుటుంబానికి దగ్గర వ్యక్తి కావడం, ఆర్థిక లావాదేవీల్లో ముదురు పోయి ఉండడం, మరోవైపు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సైతం అత్యంత సన్నిహితంగా మెలగడం చెవిరెడ్డి చేసేవారు. దీంతో కచ్చితంగా ఆయనకు జగన్ క్యాబినెట్లో బెర్తు ఉంటుందని భావించారు. అయితే రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గ నేతలు పెద్ద ఎత్తున మంత్రి పదవికి ఆశావహులుగా ఉండటంతో పాటు చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగిరి ఎమ్మెల్యే రోజా కూడా రెడ్డి వర్గం కావడంతో చెవిరెడ్డికి అవకాశం దక్కలేదు. అయితే చెవిరెడ్డి అడిగిన అన్ని పదవులను జగన్ కాదనకుండా ఇచ్చారు. క్యాబినెట్ హోదాలోని ప్రభుత్వ విప్ తో పాటు, తుడ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు పదవి కూడా చెవిరెడ్డికి కేటాయించారు. దీంతో స్థానికంగా చెవిరెడ్డి చక్రం తిప్పే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు మొదటినుంచి చెవిరెడ్డి రాజకీయం మీద ఆయన కుటుంబంతో వైయస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం మీద ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే వ్యక్తిగా జగన్ కు మంచి గురి ఉంది. వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వైసీపీ లావాదేవీలు చూసుకునే వ్యక్తి అవసరం జగన్ కు ఉండడంతోనే చెవిరెడ్డిని దగ్గర పెట్టుకున్నారు అనేది బహిరంగ రహస్యం. వివిధ మార్గాల ద్వారా డబ్బులు తీసుకువచ్చే సత్తా చెవిరెడ్డికి ఉండడంతోనే ఆయన పరిచయాలను వాడుకోవాలి అనేది జగన్ భావించి ఆయన దగ్గర పెట్టుకోవాలని అనుకోని ఉంటారు. దీంతోపాటు పార్టీలోని అందరి నేతలు అజాతశత్రువుగా పేరుపొందిన చెవిరెడ్డి ఏ విషయం చెప్పినా అత్యంత రహస్యంగా చేయగలరు అని పేరుంది. ఇది కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసిపికి అవసరం కాబట్టి జగన్ చెవిరెడ్డిని బయటకు వెళ్ళనీయకుండా తన దగ్గరే ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది.

చెవిరెడ్డి కొడుకుకు అవకాశం

స్థానికంగా చంద్రగిరి నియోజకవర్గంలో కొడుకు మోహిత్ రెడ్డి పేరు అధికారికంగా జగన్ కన్ఫామ్ చేసినట్లు చెప్పడంతో ఈమధ్య నియోజకవర్గం అంతా తిరిగి మోహిత్ రెడ్డిని పరిచయం చేస్తూ ఆయన సభలు పెట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి చెవిరెడ్డి మాకం పూర్తిగా జగన్ తోనే ఉండనుంది. దీంతో ఇప్పుడిప్పుడే కొడుకుకి రాజకీయం నేర్పిస్తూ, చెవిరెడ్డి తన రాజకీయ వారసుడిని ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *