fbpx

వ్యవస్థల్ని ఉసిగొల్పిన వారితో చేతులు కలిపిన వారు వారసులా ? : జగన్మోహన్ రెడ్డి

Share the content

వైఎస్‌ఆర్‌ పేరును అప్రతిష్టపాలు చేయాలని…దేశంలోని అన్ని వ్యవస్థల్ని తనపై ఉసిగొల్పిన వారితో చేతులు కలిపినవారు రాజశేఖరరెడ్డికి వారసులా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి,కడప లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం తమను కాంగ్రెస్‌ ఇబ్బందులకు గురిచేసింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కడప ఎంపీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఐదు లక్షలపై మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చిన పార్టీతో కలిసి, రాష్ట్ర విభజన చేసిన పార్టీలతో తాను జత కట్టాలా అని ప్రశ్నించారు. టీడిపి అబద్ధాలు మేనిఫెస్టోను నమ్మి మోసపోవద్దు. చంద్రబాబు గెలిస్తే పథకాల కొనసాగింపు ఉండదు. టిడిపి కూటమి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వివరించారు. మరల సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారు..వారిని ఓడించాలని కోరారు. పథకాలు అమలు కావాలంటే ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని పిలుపునిచ్చారు. 59 నెలల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 2,70,000 కోట్లను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకులను మార్చడానికి ప్రయత్నించామని తెలిపారు. 93 శాతం ప్రజలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పించామన్నారు. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామని చెప్పారు. మూడు రోజుల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపిలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదని, రాబోయే ఐదేళ్లు మీ ఇంటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవన్నారు.ముస్లిం రిజర్వేషన్లు మతప్రాతిపదికన ఇచ్చినవి కానేకావని, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల్లో పేదలు ఉన్నట్లే ముస్లిముల్లో కూడా పేదలున్నారన్నారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ వంటి అంశాల్లోనూ మద్దతుగా నిలుస్తానన్నారు. ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకించే ఎన్‌డిఎ కూటమిలోనే చేరి, మోసాలతో కూడిన దొంగప్రేమను చంద్రబాబు ఒలకబోస్తున్నారని విమర్శించారు. మోడీ సభలో ముస్లిం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రస్తావించగలరా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *