fbpx

కార్మికులు దాచుకున్న 2,500 కోట్ల లెబెర్ సెస్ ను దారి మళ్లించారు : సిఐటియు

Share the content

నవరత్నాల పేరుతో కొంత మందికి పథకాలు ఇచ్చి, 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చట్టబద్ధంగా భరోసానిచ్చే సంక్షేమబోర్డును నిర్వీర్యం చేసారని ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సిఐటియు అనుబంధం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు విమర్శించారు.ఈ మేరకు మంగళవారం కాకినాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లిరాణికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ కార్యనిర్వహక అధ్యక్షులు చెక్కల రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమబోర్డు పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

భవన నిర్మాణ కార్మికులకు నిలుపుదలచేస్తూ ఇచ్చిన 1,214 మెమోను రద్దు చేయాలని కోరారు. 2019 నుంచి పెండింగ్ లో ఉన్న పరిహారాలను కార్మికులకు తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవననిర్మాణ కార్మికులకు ఈ ఐదేళ్ల కాలంలో తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు దాచుకున్న లేబర్ సెస్ రూ. 2,500 కోట్లను దొడ్డిదారిన తన అవసరాలకు దారి మళ్లించేసారని మండిపడ్డారు.కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన ప్రసూతి సహాయం, వివాహ బహుమతులు, సహజ మరణం, ప్రమాద మరణాల పరిహారాలను చెల్లించకుండా అన్ని పధకాలను 1,214 మెమో ద్వారా అన్నిటిని స్వయానా ముఖ్యమంత్రి ఆదేశాలతో నిలుపుదలచేసి రెండు విధాలగా భవన నిర్మాణ కార్మికులను ముంచేసారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికశాఖ అధికారులకు, సచివాలయ సిబ్బందికి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర మంత్రులకు ఈ ఐదేళ్ల కాలంలో అనేక దఫాలు వినతులు ద్వారా, నిరసనల ద్వారా సమస్యలను తెలియజేసినా చలనం లేకుండా బండ రాయిలా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అనేక కొత్త పథకాలను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల ద్వారా అందిస్తున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన సమయం అసన్నమయ్యిందని, అందుకు ఫిబ్రవరి అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కార్మికులందరూ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, కాకినాడ రూరల్ మండల నాయకులు టి.రాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *