fbpx

కష్ట కాలంలో లోకేష్ కు అండగా చిన్నమ్మ

Share the content

చంద్రబాబు కు పక్కలో బల్లెంలా తయారవుతారు అని మొదట భావించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షురాలు పురందరేశ్వరి ఇప్పుడు పూర్తిగా టిడిపికి సానుకూలంగా ప్రవర్తించడం ఇప్పుడు వైసీపీ అధినాయకత్వాన్ని సైతం కలవరపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ కు సోము వీర్రాజు తర్వాత అధ్యక్షురాలుగా వచ్చిన పురందరేశ్వరి కచ్చితంగా చంద్రబాబు కు చెక్ పెడతారని మొదట్లో అంతా భావించారు. గతంలో ఉన్న వివాదాలు కుటుంబాల మధ్య వైరం కారణంగా కచ్చితంగా పురందేశ్వరిని నియమించడం వెనక బిజెపి గేమ్ ప్లాన్ ఉందని అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా పురందరేశ్వరి టిడిపికి అనుకూలంగా జగన్ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ముందుకు వెళ్లడం ఇప్పుడు టిడిపి నేతలకు కాస్త ఆనందం కలిగించే వార్త అయితే వైసిపి నేతలకు మాత్రం పూర్తిగా ఇది మింగుడు పడని అంశం గా ఇది తయారైంది.

చంద్రబాబు కేసులో పూర్తిగా ఏం జరిగింది అని చెప్పుకోవడానికి లోకేష్ ఎప్పటినుంచో అమిత్ షా అపాయింట్మెంట్ను కోరుతున్నారు. ఎట్టకేలకు అది ఫిక్స్ అయింది. దీంతో హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి విషయాన్ని సవివరంగా చెప్పారు. అమిత్ షా తో భేటిలో పురందరేశ్వరి తో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. అయితే ఈ భేటీలో రాజకీయ చర్చలు ఏమీ జరగలేదు అనుకున్నప్పటికీ వచ్చే తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అమిత్ షా ఏమైనా లోకేష్ కు మద్దతు కోరారా లేదా అన్నది కూడా కీలకం కానుంది. తెలంగాణలో సెటిలర్స్ ఓట్లు ఎక్కువ. హైదరాబాదులో గెలుపు ఓటములు నిర్ణయించే స్థాయిలో అవి ఉంటాయి. అలాగే ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఆంధ్రమూలాలు ఉన్నవారి ఓట్లు కూడా అధికం. వీరిలో అధిక భాగం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని భావిస్తున్నారు. ఈ సమయంలో కచ్చితంగా తెలంగాణలో అంతగా ప్రాబల్యం లేని పూర్తిగా నాయకులు లేని టిడిపి ఓటు బ్యాంకు నిర్వీర్యం కాకుండా బిజెపి వైపు తిరిగేలా ఏమైనా చర్చలు జరిగాయా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అమిత్ షాతో లోకేష్ కలిసిన సందర్భంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉండడంతో కచ్చితంగా వచ్చే తెలంగాణ ఎన్నికల మీద ఏమైనా చర్చ జరిగిందా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ బిజెపికి తెలంగాణలో సంపూర్ణ మద్దతు కనుక ప్రకటిస్తే దానికి ప్రతిఫలంగా లోకేష్ ఏం కోరారు అనేది కూడా కీలకమే. అయితే దగ్గరుండి పురందరేశ్వరి లోకేష్ ను కేంద్రం పెద్దల వద్దకు తన పలుకుబడిని ఉపయోగించి తీసుకు వెళ్లడం అనేది వైసీపీ నేతలకు అసలు గిట్టడం లేదు. మొన్నటికి మొన్న మద్యం దుకాణాల మీద, మద్యం అమ్మకాలు మీద క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఏకంగా కేంద్ర పెద్దలను కలిసి మద్యంలో జరుగుతున్న అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని కోరిన పురందరేశ్వరి ఇప్పుడు లోకేష్ కు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైసిపి నాయకులకు ఎక్కడో ఏదో ఒక మూల అనుమానం కలుగుతుంది. మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కర్త కర్మ క్రియ బిజెపి అవుతుందా అనే అనుమానం వైసిపి నేతలకు ఇప్పుడు బలపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *