fbpx

శ్రీకాకుళంలో మారుతున్న రాజకీయం!

Share the content

శ్రీకాకుళం రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్న తరుణంలో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలి అన్న అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కీలకంగా మారింది. రామ్మోహన్ నాయుడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ విషయం చెప్పడంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా బలమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది.

తెలుగుదేశం పార్టీలోకి రావాలని మాజీ ఎంపీ కిళ్ళి కృపారాణి ఆలోచిస్తున్నారు. బలమైన కాళింగ సామాజిక వర్గం నుంచి ఎంపీ అయిన ఆమె తర్వాత ఒక పర్యాయం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన ఆమె అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే వైసిపి అధిష్టానం ఆమెకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు ఎన్నికల తర్వాత కూడా ఆమెకు కనీసం నామినేటెడ్ పోస్ట్ ను ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగాను కొనసాగిన కృపారాణి ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా కృపారానికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చేది లేదని వైసీపీ అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్న తరుణంలో ఆమె తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. రామ్మోహన్ నాయుడు ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయకపోతే కృపారాణి బలమైన అభ్యర్థి అవుతుందని జిల్లాలో కళింగ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న సమయంలో కచ్చితంగా ఇది పార్టీకి ఉపయోగపడుతుంది అని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్న కృపారాణి రాజకీయం కూడా జిల్లాకు పనికి వస్తుందని అనుకుంటున్నారు. అయితే కృపారాణి ఏ అడుగు వేస్తారు అన్నది కీలకంగా మారింది. ఒకవేళ ఆమె కాకపోతే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ ను ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది. అయితే శ్రీధర్ ను వైసీపీలోకి తీసుకువచ్చి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలి అని ధర్మాన సోదరులు ఇప్పటికే చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉన్న శ్రీధర్ అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులు కూడా భరించే అవకాశం ఉండడంతో ఈ దిశగా ధర్మాన సోదరులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు డాక్టర్ శ్రీధర్ మొగ్గు చూపుతారు అని బలమైన ప్రచారం జరుగుతోంది. రామ్మోహన్ నాయుడు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తాను అని చెప్పడం ద్వారా శ్రీకాకుళం అసెంబ్లీ సీటు ఆయనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో కచ్చితంగా రామ్మోహన్ నాయుడు డాక్టర్ శ్రీధర్ను గెలిపించుకునే బాధ్యతను తీసుకోవచ్చని టిడిపి అధిష్టానం భావించడం వలన ఆయనను అసెంబ్లీకి పంపడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే శ్రీధర్ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *