fbpx

బెజవాడ బరిలో అన్నదమ్ముల సవాల్..

Share the content

విజయవాడ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుందా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే నిజమే అనిపిస్తుంది. కేశినేని సోదరులు మధ్య నువ్వా నేనా అన్నట్టు వచ్చే ఎన్నికల్లో గట్టి యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేశినేని నాని త్వరలోనే వైఎస్ఆర్సిపి లో చేరే అవకాశాలు, అలాగే కేశినేని చిన్నిని టిడిపి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేశినేని నానిని చిన్ని తట్టుకోగలరా..? అన్నను మరిపిస్తూ రాజకీయం ఎలా చేయగలరు అన్నది కీలకం కానుంది.

అన్నీ నియోజకవర్గాల్లో పట్టు

కేశినేని నాని మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడే విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత క్యాడర్ ను బలపరుచుకోగలిగారు. తన సొంత అనుచర గణాలను గ్రామాల్లో పెట్టుకోగలిగారు. దీంతోపాటు సొంతంగా ఇమేజ్ సాధించారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను విజయవాడ లోక్సభ పరిధిలో చేపట్టగలిగారు. స్థానిక శాసనసభ్యులు సహకారం లేకుండా టాటా ట్రస్ట్ సహకారంతో ఏకంగా రతన్ టాటా ను కలిసి పలు ప్రాజెక్టులను సాధించుకోగలిగారు. దీంతో కేసినేని నాని విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో సొంత ఇమేజ్లో దూసుకుపోగలిగారు. ఇది కచ్చితంగా 2019 ఎన్నికల్లో ఆయనకు మేలు చేసిందని చెప్పొచ్చు. విజయవాడ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించినప్పటికీ లోక్ సభ పరిధిలో మాత్రం కేశినేని నాని విజయం సాధించడం విశేషం. కేవలం విజయవాడ ఈస్ట్ లో మాత్రమే టిడిపి శాసనసభ్యులు గెలిపించుకోగా, మిగిలిన ఆరు నియోజకవర్గాలలో వైసీపీ ముందుంజ వేసింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఓట్లకు పడిన ఓట్ల కంటే ఎంపీ ఓట్లకు కేశినేని నానికి ఓట్లు ఎక్కువ శాతం పడడం విశేషం. ఇది కేవలం కేశినేని నాని ఒక ప్రణాళికతో తన సొంత ఇమేజ్ నిలబెట్టుకోవడంతోనే సాధ్యమైంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆర్థికంగా పట్టున్న పొట్లూరు వరప్రసాద్ ను వైసీపీ నుంచి గత ఎన్నికల్లో నిలబెట్టిన విజయవాడ ఎంపీ స్థానం వైసీపీ సాధించలేకపోయింది.

చిన్ని ఢీ కొట్టగలరా?

విజయవాడ ఎంపీగా 2019లో గెలిచిన దగ్గరనుంచి కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా తయారయ్యారు. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఎదురు తిరిగేలా ఆయన కొన్ని విషయాల్లో ప్రవర్తించారు. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయనకి వ్యతిరేకంగా మారిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా తన కూతురు పేరును కేసినేని ప్రకటించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో విజయవాడలోని టిడిపి అంతా ఒకవైపు కేశినేని నాని మరోవైపు అన్నట్లు పరిస్థితి తయారయింది. దీంతో కేశినేని నాని తమ్ముడు చిన్నిని తెలుగుదేశం పార్టీ అధినేత ప్రోత్సహించడం మొదలుపెట్టారు. విషయం వెంటనే గ్రహించిన కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరంగా జరగడం వైసిపి శాసనసభ్యులతో దగ్గర అవడం జరిగింది. దీంతోపాటు ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చేష్టలు కూడా కచ్చితంగా అధికార వైసీపీలోకి కేశినేని నాని త్వరలోనే వెళ్తారు అన్న ప్రచారానికి బలం చేకూర్చాయి. దీనికి తగినట్లుగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తగిన హామీ ఇస్తే కేశినేని నాని ఫ్యాన్ గాలిలో సేదతీరడం ఖాయం కావచ్చు. అయితే అని నియోజకవర్గాల్లో నువ్వు పట్టున్న నానికి దీటుగా తెలుగుదేశం పార్టీ తరఫున కేశినేని చిన్ని ప్రభావం చూపించగలుగుతారా అన్నది పెద్ద ప్రశ్న. చిన్నికి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల సపోర్ట్ మాత్రమే ఉంది. క్షేత్రస్థాయిలో వారు ఎంత మేర చిన్నికి పనిచేస్తారు అన్నది కూడా సందేహమే. ఆర్థికంగానూ పూర్తిగా బలంగా లేని రాజకీయ ఉద్దందుడిగా ఉన్న కేశినేని నాని మీద ఎంత మీద ప్రభావం చూపుతారో అనేది చూడాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *