fbpx

ప్రధాని పర్యటనకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు : సిఎస్ జవహర్ రెడ్డి

Share the content

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈనెల 16న శ్రీ సత్యసాయి జిల్లా పాల సముద్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఖరారైన ప్రోగ్రాం ప్రకారం ఈనెల 16న మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని అదే రోజు సాయంత్రం తిరిగి వెళ్ళనున్నారని తెలిపారు. కావున ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పీలను సిఎస్ ఆదేశించారు. ప్రధాన మంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి కూడా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ సూచించారు. ముఖ్యంగా ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రత,రవాణా, వసతి,వైద్య సేవలు వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు తెలిపారు.

ప్రధాని పర్యటన సందర్భంగా దూరదర్శన్, ఆకాశవాణి సహా ఇతర ఎలక్ట్రానిక్ మీడియా,ప్రింట్ మీడియాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేందుకు సమాచార శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో అవసరమైన చోట్ల స్వాగత తోరణాలు సహా ఇతర హోర్డింగులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ తరపున అన్ని రకాల అత్యవసర వైద్య సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలను,సరిపడిన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమీపంలో గల శ్రీ సత్యసాయి ఆసుపత్రిని అత్యవసర వైద్య సేవలకై నోడలు ఆసుపత్రిగా సిద్ధం చేసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా యంత్రాంగం తరపున పాస్ లు జారీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్,ఎస్పీలను సిఎస్ ఆదేశించారు.

వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్ఐబి ఐజి వినీత్ బ్రిజ్ లాల్, ఐఅండ్ జెడి పి.కిరణ్ కుమార్ పాల్గొన్నారు. వర్చువల్ గా శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పి మాధవ రెడ్డి,డైరెక్టర్ ప్రోటోకాల్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి,డియంఇ డా.నరసింహం, ఐఅండ్ పిఆర్ జెడి టి.కస్తూరి, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ డి.మురళి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *