fbpx

4జి,5జి అనుమతులకై బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె

Share the content

ప్రైవేటు టెలికాం ఆపరేట్లర్ల లాభాలను పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ సంస్థల నుండి 4జి, 5జి ఎక్విప్మెంట్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కు అనుమతులు నిరాకరిస్తుందని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఉమామహేశ్వరరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ విమర్శించారు. బుధవారం కాకినాడ మెయిన్ రోడ్డు నందు గల బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బిఎస్ఎన్ఎల్ సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని వేతన సవరణ వెంటనే పరిష్కరించాలని, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని, 2017 నుండి పెన్షన్ సవరణ వెంటనే ఇవ్వాలని, నాలుగు లేబర్ కోట్లు రద్దుచేసి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే ఒకరోజు సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


బిఎస్ఎన్ఎల్ ఆధునీకరణకు ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయని తెలిపారు.ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు కమ్యూనికేషన్ అందించేందుకు బిఎస్ఎన్ఎల్ సేవలే మూల స్తంభంగా నిలబడిందని, ప్రైవేట్ ఆపరేటర్లు అక్కడి ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని గుర్తుచేశారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందించడమే బిఎస్ఎన్ఎల్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యమని వివరించారు. అవి ప్రైవేటుపరం కాకుండా ప్రజల ఆస్తులను కాపాడుకోవదానికి ఉద్యోగులతో కలిసి ప్రజలు కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. రిస్ట్రక్చరింగ్ ఆఫ్ మాన్ పవర్ పేరుతో బిఎస్ఎన్ఎల్ లో ఖాళీగా ఉన్న లక్ష పోస్టులను రద్దు చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిటి, జేఈ, జేటిఓ, జేఏఓ తదితరులకు క్యాడర్ల ఉద్యోగులకు ప్రమోషన్లు నిలిపివేసి ఇటు ఉద్యోగులను, అటు నిరుద్యోగులను, దేశ ప్రజలందరినీ కార్పొరేట్ రాజకీయాలు మోసం చేశాయని అందుకు నిరసనగా ఫిబ్రవరి 16 జరిగే దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులతో పాటు బిఎస్ఎన్ఎల్ సేవలు పొందే ప్రజానీకం కూడా సమ్మెకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఎన్.ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కె.శివప్రసాద్, మహిళ విభాగం నాయకురాలు డి.జగదీశ్వరి, కుడిపూడి ఉమ మహేశ్వరరావు, కె.ప్రభాకరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *