fbpx

బ్రాహ్మణ వర్గంపై దాడులు అపాలి…బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలి : రాష్ట్ర బ్రాహ్మణ సంఘం

Share the content

రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులును ఆపనిపక్షంలో రానున్న ఎన్నికలును బహిష్కరిస్తామని బ్రాహ్మణ, అర్చక ,పురోహిత సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి హెచ్ వి సాంబశివరావు, కామర్స్ చిరంజీవి, పి సోమసుందరం, వడ్డాది గోపికృష్ణ ,కే హనుమంతరావు, జొన్నలగడ్డ కాకినాడలో బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి అర్చకులతో మాట్లాడారు. యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వివాహం చేయించేందుకు వచ్చిన పురోహితులపై అత్యంత దారుణంగా దాడి చేశారని ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ డీపీ క్రియేషన్స్ వారిపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఓటు హక్కును వినియోగించుకోవడం మానేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా మూలపేట గ్రామ పెద్దలతో సమావేశం పెట్టించి ఆ పురోహితునికి బహిరంగ క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.

సర్వేజనా సుఖినోభవంతు ..లోకా సమస్తా సుఖినోభవంతు

కాకినాడలో ఇద్దరు అర్చకులపై ఓ వ్యక్తి దాడి చేస్తున్నప్పుడు తాము కేవలం క్షమాపణ అడిగామని, అది బ్రాహ్మణులకున్న సహృదయం అన్నారు. కేసులు పెట్టి జైలుకు పంపాలని ఎప్పుడు కోరుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు ..లోకా సమస్తా సుఖినోభవంతు అని కోరే బ్రాహ్మణుల మనస్తత్వానికి ఈ క్షమాపణతో వదిలేయడం ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఇక బిక్కవోలు దేవాదాయ శాఖకు చెందిన లక్ష్మీ గణపతి ఆలయంలో అర్చకులకు పోటీగా మరో నూతన వ్యక్తిని తీసుకొచ్చే విషయంలో కూడా నేరుగా ఆలయానికి వెళ్లి చర్చించడం జరిగింది అన్నారు. ఈ రెండు సంఘటనల గురించి దేవాదాయ కమిషన్ రాము సత్యనారాయణకు తెలియజేసిన వెంటనే ఆయన స్పందించారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి సాంబశివరావుతో టెలిఫోన్ లో మాట్లాడారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో నూతనంగా ఏ అర్చకుడుని నియమించడం లేదని హామీ ఇచ్చారన్నారు. అర్చకులకు తమ శాఖ అండగా ఉంటుందని కమీషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలి

గత తెలుగుదేశ ప్రభుత్వంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఈ చట్టంకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి టేబుల్ వద్ద ఆగిపోయాయి అని వివరించారు.. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చినా ఈ చట్టం అమలు చేస్తామని హామీ ఇస్తే వారికి అండగా ఉంటామని తెలిపారు. ఇకనుంచి బ్రాహ్మణులపై దాడులు చేస్తే ఎదురుదాడులకు పాల్పడతామని హెచ్చరించారు. బ్రాహ్మణులను కులం పేరుతో దూషించడం కూడా నేరమని చట్టం చెబుతోంది. ఆ చట్టప్రకారం పోలీసులు వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సమాచారం తెలిసిన వెంటనే మూలపేటకు సంబంధించి సీరియస్ గా చర్యలు తీసుకోవాలని పిఠాపురం సిఐకు సూచించడం పట్ల సంఘాల ప్రతినిధులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరైతే ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేస్తున్నారో వారు స్పష్టంగా మీడియా ముఖ్యంగా బ్రాహ్మణులకు అండగా ఉంటామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. అప్పుడే వారికి తాము మద్దతు ఇచ్చే విషయం ఆలోచిస్తామని వారు తెలిపారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఇంద్రపాలెం దత్తు శేషాచార్యులు, వెంకటాచార్యులు, చాంగంటిపాటి అబ్బు,వై వి జగన్నాధరావు తదితరులు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *