fbpx

బ్రాహ్మణి ముందు బిగ్ టార్గెట్

Share the content

గతంలో వైఎస్ షర్మిల ప్రభంజనం సృష్టించిన విధంగా మళ్లీ నారా బ్రాహ్మణి కూడా అదే విధంగా ప్రభంజనం సృష్టించగలరా..? పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న తెలుగుదేశం పార్టీని మళ్లీ ఆమె రక్షించగలరా..?? ఇప్పటివరకు కేవలం వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే పరిమితం అయిన బ్రాహ్మణిని ప్రజలు నమ్ముతారా..? ఇలా అనేక ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను త్వరలోనే అరెస్టు చేస్తారు అన్న ప్రచారంతో ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో నారా బ్రాహ్మణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ కూతురుగా నారా బ్రాహ్మణి గతంలో తెలిస్తే ఇప్పుడు నారా లోకేష్ భార్యగా, తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ముందుకు నడిపించే నావగా నారా బ్రాహ్మణి కనిపిస్తున్నారు.

** నారా బ్రాహ్మణి బిజినెస్ మేనేజ్మెంట్లో దిట్ట. హెరిటేజ్ వ్యవహారాల్లో ఎక్కువగా ఆమె పాలుపంచుకుంటారు. నారా లోకేష్ ఇప్పటికీ అమ్మకు కూచిగా ఇంట్లోనే ఉంటారని, బ్రాహ్మణి మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాల్లో చాలా చురుగ్గా ఉంటారని దగ్గర వారు చెబుతూ ఉంటారు. గతంలో నారా భువనేశ్వరి వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటే బ్రాహ్మణి రాక తర్వాత ఆమెకు పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ చేసిన నారా బ్రాహ్మణి కూడా అంతే వేగంగా హెరిటేజ్ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఫ్యూచర్ గ్రూప్ తో జత కట్టిన హెరిటేజ్ ను కష్టకాలంలో బయటపడేసింది కూడా బ్రాహ్మణి అని చెబుతారు. ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియని దివాలా తీసే సమయంలో చాలా తెలివిగా హెరిటేజ్ గ్రూపు ఆ గ్రూపు నుంచి సంబంధాలు తెంపుకొని బయటికి వచ్చినట్లు… దీనికి నారా బ్రాహ్మణి లౌక్యమే కారణం అని చెబుతారు. అయితే అదంతా వ్యాపార కార్యకలాపం. రాజకీయాల్లో దీనికి భిన్నంగా పరిస్థితి ఉంటుంది. ప్రజలను మెప్పించాలి ఒప్పించాలి. నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి. అలాగే వారికి ఏది అవసరము గుర్తించి అదే సబ్జెక్టు మీద మాట్లాడాలి. ముఖ్యంగా మాస్ కార్యకర్తలను మెప్పించే విధంగా నారా బ్రాహ్మణి ముందుకు వెళ్లాలి. ఇప్పటివరకు కేవలం వ్యాపార కార్యకలాపాలకు రెడ్ కార్పెట్ వ్యవహారాలకు మాత్రమే పరిమితం అయిన బ్రాహ్మణి ఒకవేళ రాజకీయ రంగంలో దిగితే వీటన్నింటినీ అధిగమిస్తారా లేక పూర్తిస్థాయిలో మళ్లీ తెలుగుదేశం పార్టీని వెనక్కు నెడతారా అనే అంశం ఇప్పుడు కలవరపరుస్తోంది. వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు.. అతనికి అండగా జగన్ వదిలిన బాణంగా ప్రజల్లోకి వచ్చి మంచి పేరు సంపాదించిన వైయస్ షర్మిల అప్పట్లో వైఎస్ఆర్సిపి ని బ్రతికించారు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆమె తెగువ అలాగే అన్న బాటలో పాదయాత్ర చేసిన తీరు ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలకు గుర్తే. అప్పటివరకు అమ్మ చాటు బిడ్డగా… అన్న కు దగ్గరగా ఉండే షర్మిల ఇంట్లో నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడం దానికి తగ్గట్టుగానే మొండిగా ఆమె నడుచుకోవడం అందరికీ స్ఫూర్తివంతం అయింది. వైసీపీ పార్టీకి ఒకరకంగా ఆమె జీవం పోశారు అని చెప్పొచ్చు. అదే కష్టకాలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న సమయంలో బ్రాహ్మణి దానిని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది మాత్రం చాలా కీలకం కానుంది. బ్రాహ్మణికి సపోర్టుగా తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగా ఉండే మీడియా రాష్ట్రంలో ఉంది. ఆమె ఏం మాట్లాడాలి అన్నది చెప్పేందుకు కూడా ప్రత్యేక బృందం ఉంది. అయితే వీటన్నిటినీ సమన్వయం చేసుకొని బ్రాహ్మణి ఎలా ముందుకు వెళ్తారు ఎలా తెలుగుదేశం పార్టీకి మళ్లీ కొత్త ఉత్తేజం తీసుకువస్తారు అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *