fbpx

లోకేష్ పాదయాత్ర వెనుక..!

Share the content

లోకేష్ కష్టపడుతున్నాడు.. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు.. ప్రజలను కలిసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు.. నాయకుడిగా అందరి చేత మెప్పు పొందేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ తెలుగుదేశం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న ప్రచార పోస్టులు. అయితే లోకేష్ పాదయాత్ర సాగుతున్న తీరు మీద ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆయన కేవలం పాదయాత్రను ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అన్న కోణంలో చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. నెల్లూరు జిల్లాలో పూర్తిస్థాయిలో పాదయాత్ర చేసిన తర్వాత ప్రకాశం జిల్లాలో మందగించిన లోకేష్ పాదయాత్ర గుంటూరు జిల్లాకు వచ్చేసరికి పూర్తిగా చతికిల పడింది. గుంటూరు జిల్లాలో కేవలం వారం రోజులు కూడా లోకేష్ పాదయాత్ర చేయలేదు. సరాసరిగా ఆయన ఏకధాటిగా జాతీయ రహదారి మీదుగా వచ్చేసారు తప్పితే నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి సభలు సమావేశాలు, కనీసం నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పాదయాత్ర చేపట్టకుండానే లోకేష్ సరాసరిగా వచ్చేయడం చూస్తే ఆయన పాదయాత్ర ఏ తీరును జరుగుతుందో అర్థమవుతుంది. లోకేష్ పాదయాత్ర ఎంత వేగంగా ముగిస్తే అంత మంచిది అన్న కోణంలోనే ఇలా చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. లోకేష్ పాదయాత్రకు భారీగా జన సమీకరణ చేయాల్సి రావడం పాదయాత్ర ఖర్చు కూడా భారీగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా..? లోకేష్ పాదయాత్ర వల్ల ఏమాత్రం టిడిపికి ప్రయోజనం చేకూరే పరిస్థితి లేదు అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియడం లేదు. గుంటూరు జిల్లాలో కేవలం ఆరు రోజులు మాత్రమే లోకేష్ పాదయాత్ర సాగింది. కమ్మకోటరి బలంగా ఉండే గుంటూరు జిల్లాను ఎందుకు అలా వదిలేసారు అన్నది ఇప్పుడు చర్చినీయంసం. అనంతరం ప్రకాశం బ్యారేజ్ మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన లోకేష్ పాదయాత్ర కూడా తూతూ మంత్రంగానే సాగింది. విజయవాడ మీదుగా నిడమానూరు గన్నవరం చేరుకున్న లోకేష్ పాదయాత్ర సరాసరి పశ్చిమగోదావరి జిల్లాలోకి రానుంది. అంటే కృష్ణా జిల్లాలోనూ పూర్తిస్థాయిలో ఏ నియోజకవర్గాన్ని లోకేష్ చుట్టి రాలేదు. తూతూ మంత్రంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులను సైతం అయోమయంలో పడేస్తోంది. చెప్పడానికి లెక్కలు చెబుతున్నారు తప్పితే అసలు లోకేష్ పాదయాత్ర ఎంత మేర చేశారు అన్నది కూడా అనుమానమే.

నెల్లూరు జిల్లా వరకు మంచి జోష్ తో వచ్చిన లోకేష్ తర్వాత వచ్చిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో పాదయాత్రను కుదించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో పాదయాత్ర పూర్తిగా మందగించింది. గుంటూరు జిల్లాకు వచ్చేసరికి పాదయాత్ర పూర్తిగా పడకేసింది అని చెప్పొచ్చు. కృష్ణాజిల్లాలో ఏదో చేసాం అన్నట్లుగా చేస్తున్నారు తప్పితే పూర్తిగా… ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ కాదని కొత్త రూట్ మ్యాప్ ఆధారంగా జాతీయ రహదారి మీదుగా లోకేష్ నడిచి వచ్చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలోనూ లోకేష్ పాదయాత్ర భారీగా జరిగే అవకాశాలు ఏమి కనిపించడం లేదు. అక్టోబర్ చివరి నాటికి పాదయాత్ర పూర్తిగా ముగించాలి అని లోకేష్ బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబరు డిసెంబర్లో లోకేష్ పూర్తిగా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది. పాదయాత్రను వీలైనంత తక్కువగానే జరపాలని ముందుగానే నిర్ణయించుకొని, ఆయా మార్గాలను ఎంపిక చేసుకొని సరాసరిగా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అందులోనూ పెనమలూరు గన్నవరం నియోజకవర్గాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత లోకేష్ పాదయాత్ర చేయడం చాలా విచిత్రంగా అనిపించింది. ఆ సమయంలో కొందరిని సమీకరించడానికి పార్టీ నాయకులు నానా పాట్లు పడ్డారు. తమ నియోజకవర్గాల్లో అర్ధరాత్రి పాదయాత్ర పెట్టి ప్రయోజనం ఏముంటుందని నాయకులు వాపోతున్నారు. కచ్చితంగా పాదయాత్రను వేగంగా ముగించాలి అని తాపత్రయంతోనే లోకేష్ ఇది చేస్తున్నారు అనేది అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఏమేర ప్రయోజనం చేకూరుతుంది..? మధ్యలో పాదయాత్రను ముగిస్తే కొత్త సమస్య వచ్చే అవకాశం ఉండడంతోనే తూతూ మంత్రంగా పాదయాత్రను లోకేష్ చేస్తున్నట్లుగా క్లియర్ గా అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *