fbpx

ప్రజలే నా బలం…పెద్దిరెడ్డి అరాచకాలను ఎండగడతా : రామచంద్ర యాదవ్

Share the content

పుంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి జాగీరు కాదని, పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బొడే రామ చంద్రయాదవ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుంగనూరులో పోలీసుల ప్రవర్తన యావత్ పోలీస్ శాఖకే మచ్చతెస్తోందని మండిపడ్డారు. పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేసుకున్న ధర్మపోరాట సభను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. సభకు ఏర్పాట్లు చేస్తున్న మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల పట్ల అమానవీయంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై జులుం ప్రదర్శించారని,దొరికిన వాళ్లను దొరికినట్టు పిడిగుద్దులు గుద్దుకుంటూ బలవంతంగా వాహనాల్లో కుక్కారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొమ్మసిల్లి పడిపోయినా కనికరించకుండా అమానవీయంగా ప్రవర్తించారని వాపోయారు. పోలీసుల్లా కాకుండా పెద్దిరెడ్డి సొంత మనుషుల్లా వ్యవహరించారని మండిపడ్డారు.

మానవహక్కులను కాలరాస్తూ బిసివై కార్యకర్తలను చెప్పులతో కొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.మా కార్యకర్తలపై దాడి చేసి మళ్లీ మాపైనే తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు.ముప్పై మంది కార్యకర్తలపై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి పోలీసులు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారని వెల్లడించారు. ఎర్రచందనం దొంగలను పట్టుకునే దమ్ములేని పోలీసులు.. మా పై ప్రతాపం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుల ఆగడాలను ఇక కాలం చెల్లింది. పుంగనూరులోనే కచ్చితంగా సభ పెడతాను. పెద్దిరెడ్డి అరాచకాలను ఎండగడుతానని ధీమా వ్యక్తం చేశారు. నా నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతాను. ప్రజలే నా బలం” అని రామచంద్రయాదవ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *