fbpx

ఆక్వా రంగానికి అత్యధిక ప్రాధాన్యత :ఆక్వా సాధికారత కమిటీ

Share the content

రాష్ట్రంలో ఆక్వారంగంను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ఆక్వా సాధికారిత కమిటీ పేర్కొంది. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన 9వ ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆక్వా సాధికారిత కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఆక్వారంగంలో సమస్యలను సమీక్షించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులు సైతం మార్కెట్ రేట్లను, అంతర్జాతీయంగా ఆక్వారంగంలో ఏర్పడే ఒడిదొడుగులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ధరల స్థిరీకరణ కోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మత్స్యశాఖ అధికారులు మాట్లాడుతూ…. సీడ్, ఫీడ్ ధరలు, ఆక్వా ఉత్పత్తులకు సరైన రేటు, దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగంను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను కమిటీకి వివరించారు. ఆక్వా సాధికారిత కమిటీ ఏర్పాటైన తరువాత ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అటు ఆక్వా రైతులను, ఇటు సీడ్, ఫీడ్ తయారీ సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వాహకులను సమన్వయం చేసుకుంటూ మార్కెట్ లో రైతులకు నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిఫలితంగా ప్రస్తుతం మార్కెట్ లో ఆక్వా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయని అన్నారు. అలాగే ఇష్టారాజ్యంగా సీడ్, ఫీడ్ రేట్లను పెంచకుండా శాస్త్రీయంగా వాటిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటిస్తూ, రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు వివరించారు. వంద కౌంట్ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తోందని అన్నారు. గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటు రైతుకు దక్కుతోందని, సాధికారిత కమిటీ కృషి వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ష్రింప్ రేట్లకు సంబంధించి ఎటువంటి సమస్య ఎదురైనా సరే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసి, ఎక్కడ సమస్య ఎదురైనా వాటిని తక్షణం పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ-ఫిష్ సర్వే ద్వారా పది ఎకరాలలోపు 3,57,863 ఎకరాలు, అంతకంటే ఎక్కువ పరిధిలో 1,10,594 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని వివరించారు.

రైతులకు సీఎం వైయస్ జగన్ సబ్సిడీపై విద్యుత్ ను అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఆక్వా రైతులకు సబ్సిడీ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్వాసాగుకు సంబంధించి 43,548 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వీటికి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రూ.513 కోట్లు భరిస్తోందని తెలిపారు.
ఆక్వా ఎగుమతులతో పాటు దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల వినియోగంను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్రంలో మొత్తం 2259 ఆక్వా హాబ్ లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. దీనిలో 1962 హబ్ లు ఇప్పటికే పనిచేస్తున్నాయని, వీటి ద్వారా 657 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విక్రయించడం జరిగిందని తెలిపారు. దీనిని మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో స్సెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ (ఇఎస్&ఎఫ్ టి), కె.విజయానంద్ (ఎనర్జీ), గోపాలకృష్ణ ద్వివేది (ఫిషరీస్) జెన్కో ఎండి కెవిఎన్ చక్రధర్ బాబు, మత్య్సశాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *