fbpx

చివరి 72 గంటలు…..పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లపై ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు

Share the content

ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో లను, ఎస్పీ లను ఆయన ఆదేశాలు జారీచేశారు.చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లను ఆయన వివరిస్తూ ఈ నెల 11 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోల్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం అమల్లోకి వస్తున్నదని, ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు. చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం మరియు 48 గంటల వ్యవధిలో బహిరంగ సభలను నిర్వహించడంపై సీఆర్పిసి యొక్క సెక్షన్ 144 కింద నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయబడతాయన్నారు. ఈ అంశం సెక్షన్ 144లో ప్రత్యేకంగా ఉండాలన్నారు. పోల్ ముగింపు సమయం ఆధారంగా 48 గంటల డ్రై డే సమయం సవరించబడుతుందన్నారు. పోల్ ముగిసే 48 గంటల ముందు లౌడ్ స్పీకర్లను అనుమతించకూడదన్నారు.

ఎన్నికల్లో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకై ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్రమ రవాణాను నిరోధించడానికి పోలింగ్‌కు 3 రోజుల ముందు నుండి రాష్ట్రంలోను, అంతర్ రాష్ట్రాల నుండి వచ్చే లారీలు, వాణిజ్య వాహనాలు మరియు తేలికపాటి వాహనాల కదలికలపై గట్టి నిఘా ఉంచడం జరిగిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఓటు ఉన్న ఓటర్లు అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జి సభ్యులకు నిధులు, బహుమతులు, ఆహారం ఉచితంగా పంపిణీ చేయకూడదని, కమ్యూనిటీ హాళ్ల వినియోగం, కూపన్‌లు,కార్డుల పంపిణీ, కమ్యూనిటీ కిచెన్ మొదలైనవి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లు

పోలింగ్ ముగిసే వరకు అత్యంత కీలకమైన 72 గంటల పాటు తీసుకున్న చర్యలను చర్చించుకునేందుకు డీఈఓలు, ఎస్పీ/సీపీ, ఇతర సీనియర్ పోలీసు అధికారులు, జనరల్ ,పోలీస్ , పరిశీలకులతో జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకోవాలని సూచించారు.

పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు

పోలింగ్ జరిగే ప్రతి చోట మెడికల్ అటెండెంట్‌తో పాటు తగిన సంఖ్యలో మెడికల్ , ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ పార్టీలు, ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకై ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలన్నారు. వడదెబ్బ విషయంలో చేయవలసినవి మరియు చేయకూడని వాటిపై హ్యాండ్‌బిల్ ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సరఫరా చేయాలన్నారు. బీఎల్‌ఓతో ఓటింగ్ అసిస్టెంట్ బూత్‌లు, ఆల్పాబెటికల్ క్రమంలో ఓటర్ల జాబితా, పీడబ్ల్యూడీ, వృద్ధాప్య ఓటర్లకు సహాయం అందించాలన్నారు. మీడియా కంట్రోల్ రూమ్, కమ్యూనిటీ కంట్రోల్ రూమ్ మరియు వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్‌లతో కూడిన జిల్లా కంట్రోల్ రూమ్ తప్పకుండా పని చేస్తుండాలన్నారు. EVM మెషీన్ల ట్రబుల్షూటింగ్ కోసం సమర్థవంతమైన సాంకేతిక సిబ్బందిని సిద్దంగా ఉంచాలన్నారు. పోలింగ్ రోజున ఈ.వి.ఏం మెషీన్లపై ఫిర్యాదులు అందిన 15-20 నిమిషాలలోపే మెషీన్ల మరమ్మత్తుకు/రిప్లేస్ మెంట్కు చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ నుండి లేదా పొరుగున ఉన్న పోలింగ్ స్టేషన్ కు చెందిన వ్యక్తి అయి ఉండాలని, ఒకవేళ అందుబాటులో లేకుంటే అదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఓటరు అయ్యేలా చూడాలన్నారు. ప్రతి అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ ప్రతి PS వద్ద ఒక పోలింగ్ ఏజెంట్‌ను మరియు ఇద్దరు రిలీప్ ఏజెంట్‌లను నియమించుకోవచ్చని, అయితే పి.ఎస్ లోపల ఒక సమయంలో ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలన్నారు. పోల్ రోజు ఫిర్యాదు నిర్వహణ మరియు సమాచార నిర్వహణ కోసం సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఓటు వేసే కంపార్టుమెంట్లు మినహా గరిష్టంగా కనిపించే విధంగా ఉంచాలన్నారు. వెబ్‌కాస్టింగ్‌ ప్రసారం డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ మరియు సీఈఓ కంట్రోల్ రూమ్కే పరిమితం చేయాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లేదా యూట్యూబ్‌లో లేదా వేరే వ్యక్తికి ప్రసారం చేయకూడదు అన్నారు. పోలింగ్ రోజున పి.ఎస్. చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. పోలింగ్ స్టేషన్కు 200 మీటర్లకు పైబడిన దూరంలో అభ్యర్థి ఎన్నికల బూత్ ను ఒక టేబుల్, కుర్చీలతో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అబ్జర్వర్ మరియు అధీకృత ఎన్నికల పోలీస్ అధికారులు మినహా ఏ వ్యక్తి కూడా పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో (పోలింగ్ స్టేషన్కు 100 మీటర్లు పరిధిలో) మొబైల్ / వైర్‌లెస్ సెట్‌లను తీసుకెళ్లడానికి లేదా ఉపయోగించడానికి అనుమతించకూడదన్నారు. పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి తన సొంత ఉపయోగం కోసం ఒక వాహనం, వారి ఎన్నికల ఏజెంట్ వినియోగార్థం ఒక వాహనం, పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో తన ఎన్నికల ఏజెంట్ లేదా కార్యకర్తలు లేదా పార్టీ కార్యకర్తల ఉపయోగం కోసం మరొక వాహనం అనుమతించబడుతుందని ఆయన తెలిపారు. అయితే అభ్యర్థి వాహనాన్ని మరెవరూ వినియోగించకూడదని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *