fbpx

ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడది ? : బాలకృష్ణ

Share the content

ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది? : బాలకృష్ణ

అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ‘బైబై జగన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. జాబ్‌ క్యాలెండర్ విడుదల ఎప్పుడు? పోలవరం పూర్తి ఎక్కడా? అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పనైపోయిన వైకాపా ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏముంటుందని వ్యాఖ్యానించారు. తమను చూసి సీఎం జగన్ భయపడుతున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చే నేతలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. అనంతరం బారికేడ్లను తోసుకుంటూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.

జగన్‌కు ఇవే చివరి సమావేశాలు : అచ్చెన్నాయుడు

అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైకాపాలా ఒక స్థానానికి ఉదయం ఒకరిని, రాత్రికి మరొకరిని మార్చే పార్టీలు తెలుగుదేశం, జనసేన కావన్నారు. చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ఒక అబద్ధాల కోరని నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. జగన్ ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. పులివెందులలో గెలుపుపై జగన్ నమ్మకం కోల్పోయారని.. వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఇవే చివరి సమావేశాలన్నారు. డీఎస్సీ విషయంలో 5 ఏళ్లుగా సీఎం తమని మోసం చేశారంటూ బాలకృష్ణకు నిరుద్యోగులు వినతిపత్రాలు అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పక న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *