fbpx

మూడు రోజులు కీలకం…అప్రమత్తత అవసరం : ముఖేష్ కుమార్ మీనా

Share the content

గత కొన్ని నెలలుగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న కృషికి పరీక్షా సమయం ఆసన్నమైంది. ఈనెల 13న జరుగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో లను, ఎస్పీ లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి డిజిపి హరీష్ కుమార్ గుప్తాతో కలసి ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు చివరి ఘట్టం ఆసన్నమైందన్నారు. రానున్న మూడు రోజులు ఎంతో కీలకమైనవని, అన్ని జిల్లాల ఎన్నికల యంత్రాంగం అంతా ఎంతో అప్రమ్తతంగా ఉంటూ ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలకు, ఓటర్లను ప్రలోభపర్చే కార్యక్రమాలకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని, ప్రక్క రాష్ట్రాల నుండి వచ్చే ఓటర్లకు పోలింగ్ రోజు కూడా వచ్చేందుకు ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు చేయవలసిన ఏర్పాట్లను, అనుసరించాల్సిన విధివిదానాలను ఆయన వివరిస్తూ ఎన్నికల సిబ్బంది నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉద్యోగులందరూ వారికి అప్పగించిన విధులకు తప్పకుండా హాజరయ్యేలా చూడాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నుండి పర్యవేక్షించాలన్నారు. షాడో ఏరియాలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ నుండి దూరంగా ఉన్న గ్రామస్తులను తరలించేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కొన్ని ప్రాంతాలలో హెలికాప్టర్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు అందరికీ సకాలంలో ఓటర్ స్లిప్స్ అందేలా చూడాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా వాటి కదలికలను గమనించాలన్నారు. బెల్ ఇంజనీర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈవీఎంల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. 48 గంటల ముందు అంటే 11 తేదీ సాయంత్రం 6.00 గంటల డ్రైడే ప్రారంభమవుతుందని డ్రై డేను పటిష్టంగా అమలుపరచాలన్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ఏమాత్రం ఎండబారని పడకుండా క్యూలైన్ లు అన్ని షామియాలతో కవర్ చేయాలన్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూర్చునేందుకు బెంచీలు, ప్రధమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.

డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విస్తరణ ప్రణాళికలను పటిష్టంగా అమలుపరచాలన్నారు. పటిష్టమైన ప్రణాళికలు రూపొందించడం ఒక ఎత్తు అయితే, వాటిని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా అమలు పర్చడం అనే గురుతరమైన బాధ్యత సంబందిత పోలీస్ అధికారులపై ఉంటుందన్నారు. అమల్లో ఏమాత్రం తేడా వచ్చిన ఊహించిన ఫలితాలు రావన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సూక్ష్మ ప్రణాళిలను రూపొందించుకుని అమలు పర్చడమే కాకుండా, సమస్యలపై సకాలంలో స్పందిస్తూ, సరైన చర్యలు చేపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనకాపల్లి, కృష్ణా , పల్నాడు, చిత్తూరు జిల్లాలో పలు అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని, భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సూక్ష్మ ప్రణాళికలను అమలు చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ సరిహద్దులు గల జిల్లాలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజు వాహనాలు, వ్యక్తుల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత ఎన్నికల్లో గిరిజన ప్రాంతాలతో పాటు పలుచోట్ల చీకటి పడే వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని, అటువంటి పరిస్థితులు ఈ ఎన్నికల్లో పునరావృతం కాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ & అదనపు డీజీపీ (లా & ఆర్డర్) ఎస్. భాగ్చీ, అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఐ.జి.లు, డి.ఐ.జి.లు, సీపీలు, ఎస్పీలు వారి జిల్లాలనుండి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *