fbpx

ఎంత డబ్బు పోసినా ఎంపీ కాలేకపోయిన ఆ బిజినెస్ మెన్!!!

Share the content

రాజకీయాలకు డబ్బుంటే సరిపోతుందా..?? డబ్బున్న ధనవంతులంతా ప్రజాప్రతినిధులు అయిపోగలరా..?? అసలు డబ్బు అందరి విషయాల్లో అద్భుతాలు చేస్తుందా..?? ఈ వ్యాపారవేత్తను చూస్తే ఇవేవీ కాదు అనిపిస్తుంది. తన జీవిత కల అయిన ఎంపీ కావడానికి ఆ వ్యాపారవేత్త ఖర్చు పెట్టిన సొమ్ము అక్షరాల వందల కోట్లు. మారిన పార్టీలు మూడు.. అయినా అతని కల నెరవేరలేదు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో.. లేదో.. అసలు పోటీ చేస్తారో లేదో కూడా తెలియదు. పార్లమెంట్ కి వెళ్లి అధ్యక్ష అనాలని కలలు కన్నా ఆ భారీ పారిశ్రామికవేత్త పేరు చలమల శెట్టి సునీల్. వేలకోట్ల రూపాయల వ్యాపారం చేసే పారిశ్రామికవేత్త. గోదావరి జిల్లాల అపర కుబేరుడు.

మూడు పార్టీలకు భారీగా విరాళాలు

చాలా రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు చేస్తున్న గ్రీన్ కో సంస్థలకు చలమలశెట్టి సునీల్ అధిపతి. కాకినాడకు చెందిన సునీల్ కు మొదటి నుంచి ఎంపీ కావాలనేది ఆశ. కాపు సామాజిక వర్గానికి చెందిన సునీల్ మొదట 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. ప్రజారాజ్యం విలీనం అనంతరం తన వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయిన సునీల్ 2014 సమయంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున మరోసారి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో మరోసారి వ్యాపార కార్యకలాపాలకు పరిమితం అయిపోయిన సునీల్ 2019లో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలి అనే కోణంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మూడోసారి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019లో జగన్ గాలి వీయడంతో వంగా గీత చేతిలో ఓటమిపాలై ముచ్చటగా మూడోసారి కూడా దురదృష్టవంతుడిగా మిగిలిపోయారు.

మళ్ళీ వైసీపీలోకి..

సునీల్ అడుగులు ఎప్పుడూ ఓడిపోయే పార్టీ వైపే పడతాయి అంటారు రాజకీయ వర్గాలు. పార్టీలకు భారీ విరాళాలు ఇస్తారని పేరు. ఈ కారణం తోనే అన్ని పార్టీలు ఎన్నికల ముందు ఆయన ఏ పార్టీలో చేరిన వెంటనే టికెట్ కేటాయిస్తాయి. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన సునీల్ తర్వాత మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో నాలుగో సారి కూడా కాకినాడ ఎంపీగా వచ్చే ఎన్నికల్లో సునీల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు అన్న లెక్కలు ఇప్పుడు వస్తున్నాయి. ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తానని చెప్పిన తరువాతనే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు అనేది అసలు విషయం. అయితే ఆయన చిరకాల కోరిక ఈసారి అయిన నెరవేరుతుందా లేదా అన్నది మాత్రం వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *