fbpx

ఆదాయపు పన్నుతో సంక్షేమ పధకాలను ఎత్తేసారు

Share the content

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అంగన్వాడీలు నా అక్కచెల్లెమ్మలంటూ తలలు నిమిరి.. నేనున్నానంటూ హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే వారిని మోసం చేశారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ సత్యనారాయణ మూర్తి విమర్శించారు. శనివారం సర్పవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద, ఇంద్రపాలెం లాకుల వద్ద నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అంగన్వాడీ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను,డిమాండ్లను వారిని అడిగి తెలుసుకున్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా చాలీచాలని వేతనాలతో కుటుంబ జీవనం కష్టంగా ఉందని వారు వాపోయారు.చిన్నపిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న సేవలను వారు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో భాగంగా తెలంగాణలో ఉన్న బెనిఫిట్స్‌ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చారని నాలుగున్నరఏళ్లుగా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్‌ అమలుచేస్తామని చెప్పి మాటతప్పి అంగన్వాడీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో అంగన్వాడీలకు రూ.10,500 చేస్తే వైసీపీ రూ.1,000 పెంచారని పేర్కొన్నారు. మిగిలిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, చెప్పేవన్ని అబద్దాలే అని విమర్శించారు. ఆదాయపన్ను సీలింగ్‌ పెట్టి వీరికి రూ.11వేలు జీతం వస్తోందని సంక్షేమ పథకాలు ఆపేయడం దారుణమన్నారు. ప్రభుత్వ అధికారులుగా చూసింది లేదు, పింఛన్‌ సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు .జీతాలు పెంచకపోగా పెంచిన ధరలకు అనుగుణంగా చేతి నుంచి డబ్బు పెట్టుకుని చేస్తుంటే ఆ బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు. సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసు కెళ్లి మేనిఫెస్టోలో చేర్చి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మరో మూడు నెలల్లో అధికారంలో కి వచ్చేది టీడీపీ,జనసేన ప్రభుత్వమేనని,వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *