fbpx

అంగన్వాడీల పోరాటం కార్మికోద్యమ చరిత్రలో నిలిచిపోతుంది : దువ్వ శేషాబాబ్జి

Share the content

తమ హక్కుల సాధన కోసం అంగన్వాడీలు చేసిన 42 రోజుల పోరాటం ఆంధ్రప్రదేశ్ కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి కొనియాడారు. కాకినాడ ధర్నాచౌక్ నందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి అభినందనసభ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి మాట్లాడుతూ…అంగన్వాడీ సంఘం రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన 12 డిమాండ్లలో 11 డిమాండ్లు సాధించుకున్నామని.. ఒక్క రూపాయి నష్టపోకుండా సమ్మె కాలపు వేతనాలు చెల్లించేలాగా, ఒక్కరిని కూడా ఉద్యోగాన్ని తొలగించకుండా అంగన్వాడీ ఉద్యమం ఘనవిజయం సాధించిందని తెలిపారు. జూలైలో వేతనాల పెంపుకై మరొక ఉద్యమం చేయాల్సిన అవసరం లేకుండానే ఇచ్చిన హామీ మేరకు తెలంగాణా కంటే అదనంగా వేతనాలు పెంచి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా అంగన్వాడీల వేతనల్లో కేంద్రవాటా పెంచలేదని, పైపెచ్చు నిత్యావసర సరుకుల ధరలు 300 శాతం పెంచారని విమర్శించారు. దేశంలో కార్మిక హక్కులు లేకుండా 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, యాజమాన్యాలకు, కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం పోరాడి సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, దారపురెడ్డి క్రాంతి, కె.సత్తిరాజు, మెడిశెట్టి వెంకట రమణ, పలివేల వీరబాబు, రొంగల ఈశ్వరరావు, నక్కెళ్ల శ్రీను, షేక్ పద్మ, టి.రాజా, కాకినాడ జిల్లా అంగన్వాడి సంఘం నాయకులు దాడి బేబీ, ఎస్తేర్ రాణి, రాజేశ్వరి, ధనలక్ష్మి, వీరవేణి, నాగమణి, జిల్లా కోశాధికారి రమణమ్మ, నగర కార్యదర్శి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బాలం లక్ష్మి, వరలక్ష్మి, చామంతి తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *