fbpx

వైసిపి ఎన్నికల కరపత్రంలా బుగ్గన బడ్జెట్ : కె రామకృష్ణ

Share the content

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చూపాల్సిన బడ్జెట్‌ కేవలం వైసీపీ ఎన్నికల కరపత్రం మాదిరిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్‌ విషయంలో ప్రధాన మంత్రి మోదీ అనుసరించిన విధానాన్నే..నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగించారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం తప్పుడు లెక్కలే… గణాంకాలేవీ నమ్మదగనివిగా లేవని పేర్కొన్నారు.. తలసరి ఆదాయంలో రాష్ట్ర ర్యాంక్ 17వ స్థానంలో ఉంది. దీన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. చెప్పినవన్నీ కాకిలెక్కలే .. ఆంధ్రాలో ఎన్నడూలేనంతగా అరాచక పరిపాలన నెలకొన్నది. జగన్‌ ఒక ఆర్థిక ఉగ్రవాది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా?12 లక్షల కోట్ల రూపాయలకు అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. కానీ బడ్జెట్‌లో అప్పులను అతితక్కువ చూపించారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? ఆదాయ, వ్యయాలకు పొంతన ఉందా? నవరత్నాలు గొప్పగా చెప్పారు. కానీ లబ్దిదారుల్లో కోత, వారికి ఇచ్చే లబ్దిలో కోత. దాన్నెందుకు చెప్పలేకపోయారు? స్కూలులో డ్రాప్‌ అవుట్లు తగ్గాయని చెప్పారు. కానీ అక్షరాస్యత పెరుగుదలలో కింది నుంచి రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. పెట్టుబడులు భారీగా తెచ్చామని చెప్పారు. నిజానికి కొత్త కంపెనీ ఒక్కటి కూడా రాకపోగా, గతంలో వచ్చిన కంపెనీలు సైతం వైసీపీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక హైదరాబాద్‌కు తరలిపోయాయిని ఆందోళన వ్యక్తం చేశారు.

సంపన్న ఆంధ్ర అని చెప్పుకున్నారు. అప్పుల ఆంధ్రా అని ప్రభుత్వ సంస్థల గణాంకాలే చెపుతున్నాయి. ఇక సంపద ఎక్కడ? అసలు సంపదనే సృష్టించలేదని తెలిపారు.మహిళా మహరాణుల ఆంధ్ర అని చెప్పడం అసహజంగా ఉంది. మన రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా మహిళల పట్ల క్రైమ్‌ రేటు పెరిగింది. మిస్సింగ్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. భూభద్ర ఆంధ్ర అని చెప్పారు. అసలు లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రతి రైతు తన భూ హక్కులను కోల్పోయే ప్రమాదంలో పడిపోయారు. రెవిన్యూ అధికారులే జడ్జిలుగా మారిపోయిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. సామర్థ్య ఆంధ్ర అని చెప్పడం చాలా దారుణం. మనల్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్‌దే. వికేంద్రీకరణ పేరుతో మూడుముక్కలాట ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రతి ఆంధ్రుని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఏపీ రాజధాని మి అంటే దేశంలో ఒక జోక్‌గా మారిపోయింది. విభజన సమస్యలు పరిష్కరించామని చెప్పడం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, విశాఖ ఉక్కును కాపాడలేకపోతున్నారు. కడప స్టీలు ప్లాంట్‌కు దిక్కే లేదు. పోలవరం ఎన్నాళ్లకు కదులుతుందో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీలు గాల్లో కలిసిపోయాయి. ఈ సీఎం తన ఐదేళ్లపాలనలో మోదీకి మోకరిల్లడం తప్ప ఒక్క విభజన సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు.ఇలాంటి చెత్త బడ్జెట్‌ ఏనాడూ చూడలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *