fbpx

ఆమంచి కథ వైసీపీలో ముగిసినట్లే!

Share the content

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కథ వైసీపీలో ముగిసినట్లే. ఇప్పటికే కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన పార్టీలో చేరి కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో ఇటీవల నియోజకవర్గంలో కరణం వెంకటేష్ తో జరిగిన వాగ్వాదం వైసీపీ అధిష్టానం వరకు వెళ్ళింది. ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జిగా వైసిపి అధిష్టానం నియమించినప్పటికీ ఆయన ఆ నియోజకవర్గ మీద దృష్టి పెట్టకుండా చీరాలలోని రాజకీయాలు చేస్తున్నారు అన్నది కరణం వర్గం ప్రధాన ఆరోపణ. కృష్ణమోహన్ చీరాలలో తన ప్రాబల్యం నిరూపించుకునేందుకు పార్టీ పరువు తీస్తున్నారు అని, తన సోదరుని కావాలనే జనసేనలోకి వ్యూహం ప్రకారం పంపి పూర్తిగా చీరాలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కరణం వర్గం చెబుతోంది. దీనిపై పార్టీలో కీలకమైన నాయకుడు విజయ సాయి రెడ్డికి కరణం బలరం ఫిర్యాదు చేశారు. పార్టీ అన్ని విషయాలను చూసుకుంటుందని పరుచూరి విషయంలో త్వరలోనే జగన్ నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి చెప్పడం ద్వారా కచ్చితంగా వచ్చే కొద్ది రోజుల్లోనే పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ నుంచి ఇన్చార్జ్ కొత్తవారు రావచ్చు అని తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఆమంచిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా పార్టీ నుంచి బయటికి పంపడం జరిగిపోతుంది. అప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఎటువైపు రాజకీయ అడుగులు తీసుకుంటారు అన్నది కీలకంగా మారుతుంది.

టీడీపీ తో పొత్తు ఉంటే

చీరాలలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ బలమైన నాయకుడు లేరు. జనసేన పార్టీకి సైతం అదే పరిస్థితి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి కరణం బలరాం కొడుకు వెంకటేష్ ను బలంగా ఢీకొనాలి అంటే అన్ని వర్గాలకు సమతూగే నాయకుడు కావాలి అని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇటీవల జనసేన పార్టీలోకి వచ్చిన ఆమంచి స్వాములతో పాటు వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఆమంచి కృష్ణమోహన్ సైతం అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగితేనే కరణం బలరామును బలంగా ఢీకొట్టగలమని టిడిపి అధినేతతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. దీంతో మారబోయే రాజకీయ మార్పులను విపక్ష పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. చీరాల విషయంలో వైసిపి అధిష్టానం తీసుకుని నిర్ణయం బట్టి ఆమంచి కృష్ణమోహన్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఆమంచి కృష్ణమోహన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి విపక్ష పార్టీలు అక్కడ ఏ అభ్యర్థిని రంగంలోకి దింపాలి అన్నది పూర్తిస్థాయిలో డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *