fbpx

మోదీ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు

Share the content

సంయుక్త కిసాన్ మోర్చాలోని 550 రైతు సంఘాలు, 11 కేంద్ర కార్మిక సంఘాలు, ట్రాన్స్ పోర్ట్ యాజమాన్య, డ్రైవర్ల సంఘాలు ఉమ్మడిగా ఇచ్చిన గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె, ట్రాన్స్ పోర్ట్ దేశవ్యాప్త సమ్మె పిలుపును కాకినాడ కె.ఎస్.పి.ఎల్ పోర్టును తెల్లవారుజాము 5 గంటల నుండి కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం బంద్ నిర్వహించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఐ.ఎన్.టి.యు.సి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏఐసీసీటియు జిల్లా కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు, ఎ.ఐ.ఎఫ్.టి.యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ….

మోడీ హయాంలో 12 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలు మాఫీ జరిగి ప్రపంచ కుబేరుల్లో చేరుతుంటే, గిట్టుబాటు ధర లభించని రైతులు రుణాలు చెల్లించలేక 1,60,000 మంది ఆత్మహత్యలకు మోడీ విధానాలే కారణమయ్యాయని విమర్శించారు. రైతాంగం పోరాట సందర్భంగా కనీస మద్దతు ధరను చట్టం చేస్తానని హామీ ఇచ్చిన మోడీ మాట తప్పి రామాలయం వెనుక దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. పరిశ్రమల్లో తయారయ్యే ప్రతి సరుకుకి మాక్సిమమ్ రిటైల్ ప్రయిస్ MRP ఉన్నప్పుడు, రైతులు పండించే పంటలకు మినిమం సపోర్ట్ ప్రయిస్ MSP ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. 150 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసి హడావిడిగా హిట్ అండ్ రన్ చట్టం చేయడంలో 60 లక్షల కోట్ల రవాణా రంగాన్ని కార్పొరేట్లు చేతిలో పెట్టే ఉద్దేశమే కనపడుతుందన్నారు. దేశంలో ఉన్న మొత్తం రహదారుల్లో రెండు శాతం మాత్రమే హైవేలుగా మార్చారని, మిగిలిన 80 శాతం రోడ్లు నేటి ఆధునిక వాహనాలకు తగ్గట్లుగా నిర్మించకుండా జరిగే ప్రమాదాలన్నింటికీ వాహన డ్రైవర్లనే బాధ్యులు ఎలా అవుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రహదారులపై విశ్రాంతి భవనాలు ఎక్కడ నిర్మించారో మోడియే సమాధానం చెప్పాలన్నారు. కార్మికులకు ఆసరాగా ఉండే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు కార్పొరేట్ లాభాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను నయా బానిసలుగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణం రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టపరిహారం భూ యజమానితో సంబంధం లేకుండా ఇవ్వాలని, ఏ పని చేసే కార్మికుడికైనా కనీస వేతనం 26,000 చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని, పెట్రోలు డీజిల్ లను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణం నిలుపుదల చేయాలని, ఉపాధి పథకానికి రెండు లక్షల కోట్లు నిధులు కేటాయించి 200 రోజులకు పని దినాలు పెంచాలని, రోజుకి 600 వేతనం చెల్లించాలని, న్యాయ సంహిత 106 హిట్ & రన్ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఆటో యూనియన్ నాయకులు వర్మ, నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, భారతి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ నగర కార్యదర్శి జ్యోతి, జిల్లా కోశాధికారి రమణమ్మ, ఐ.ఎన్.టి.యు.సి నాయకులు జగదీష్, సాయి కృష్ణసాయి, ఎ.ఐ.ఎఫ్.టి.యు నాయకులు చింతాడ అర్జునరావు, వల్లూరి సత్తిబాబు, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పిఎస్ నారాయణ, నగర కార్యదర్శి అన్నవరం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజు, ప్రసాదు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అప్పలరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, రామయ్య, అనీల్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు కసిరెడ్డి వీర్రాజు, ఐ.ఎఫ్.టి.యు నాయకులు మల్లాడి భైరవ స్వామి, కొప్పనాతి నరసింహ, బండారు సత్యనారాయణ, రామకృష్ణ, రాజేష్, రాఘవ, నోవాహు, అనూక్, అఖిల భారత రైతు కూలి సంఘం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *