fbpx

అంగన్వాడిల సమస్యలను పరిష్కరించలేని ముఖ్యమంత్రి : ఐద్వా

Share the content

గత 16 రోజులు నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తల దీక్షా శిబిరాలను కూల్చివేయడం, ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాన్ని అందించడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బి. ప్రభావతి ,డి.రమాదేవి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. విజయవాడలో అంగన్వాడీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా ప్రతినిధులకు మెమొరాండం ఇవ్వడానికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను, వారికి మద్దతుగా ఉన్న మహిళా సంఘం కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు ,షాదీ ఖానాలకు తరలించడం నిర్బంధానికి పరాకాష్ట అని విమర్శించారు. అంగన్వాడీ నాయకులు సుప్రజ, జయలక్ష్మి తదితరులతో పాటు మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీదేవిని కూడా అరెస్టు చేయడాన్ని ఖండించారు.ఇప్పటికే రెండుసార్లు మంత్రులు వారి సమస్యలపై చర్చించి కూడా ముఖ్యమంత్రితో ఇంతవరకు మాట్లాడకుండా కాలయాపన చేస్తూన్నారని విమర్శించారు.

అంగన్వాడీ కార్యకర్తలను ఆందోళన బాట పట్టించింది ప్రభుత్వమేనని వారు పేర్కొన్నారు. వారి సమ్మెను అణచి వేసేందుకు అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టించిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, డ్వాక్రా గ్రూపు మహిళల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను నడిపే దానికి పురమాయించిందన్నారు. ఆయినా న్యాయమైన అంగన్వాడీ కార్యకర్తల కోర్కెలకుకు వారందరూ మద్దతు ఇస్తున్నారన్నారు.. వివిధ తరగతుల ప్రజలు మద్దతు ఫలితంగా ఎమ్మెల్యేలు అంగన్వాడి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేస్తున్నారన్నారు. చివరకు ఫుడ్ కమిషనర్ కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని మినీ అంగన్వాడీ సెంటర్లను ప్రధాన సెంటర్లుగా మార్చాలని చెప్పవలసి వచ్చిన పరిస్థితికి వచ్చిందన్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల సర్వత్రా సానుకూలత ఉన్నా.. ముఖ్యమంత్రికి సమస్యను పరిష్కరించడం చేతకావడం లేదని తెలిపారు. బలవంతంగా నిర్బంధముతో అణిచివేయడానికి పూనుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. అంగన్వాడిల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి పూనుకోవాలి అని కోరారు. అనవసర ఆర్భాట ఖర్చులను, అధిక రేట్లు పెట్టి కొనుగోళ్ళను, ఆప్త మిత్రులకు ఆస్తులు కట్ట పెట్టడాన్ని మానుకుంటే అంగన్వాడీలు అడిగిన వేతనం కంటే అదనంగా వేతనం చెల్లించవచ్చు అని సూచించారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని, మహిళల ఆగ్రహానికి గురికావద్దని మహిళా సంఘం తరుపున ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *