fbpx

అగ్రిగోల్డ్ డిపాజిట్లను బాధితులకు చెల్లించాలి

Share the content

అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ లు ఏజెంట్స్ మరియు బాధితులకు దండలు వేసి ప్రారంభించారు. దీక్షలో పాల్గొన్న అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ “అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్” ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగో తేదీ నుండి 11వ తేదీ వరకు నియోజకవర్గాల్లో సత్యాగ్రహ దీక్షలు చేయాలని పిలుపునిచ్చారని ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాల్లో ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 18వ తేదీన కాకినాడ జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా జరుగుతుందని పేర్కొన్నారు.ఈ నెల 28, 29 తేదీలలో అగ్రిగోల్డ్ చందాదారుల ఆత్మహత్యలు,సహజ మరణాలతో మరణించిన బాధిత కుటుంబాలతో విజయవాడలో 30 గంటల విమోచన దీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు.

  • సమస్యను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు విఫలం
    సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీన పరచుకొని బాధితులకు డిపాజిట్లు రూపంలో ఉన్న సొమ్మును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితుల వాగ్దానం నెరవేర్చుకోవాలని తెలిపారు. బాధితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారని వారిని విశ్వసించి గద్దెనెక్కించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ప్రజా ప్రతినిధులు దీనిపై స్పందించలేదని, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండి వారికి రావలసిన డిపాజిట్ల సొమ్ము పై దృష్టి సారించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు తమ పిల్లల చదువు భవిష్యత్తు కోసం, ఆడ పిల్లల పెళ్లి కోసం, ఇల్లు నిర్మాణం కోసం రూపాయి రూపాయి దాచుకున్న సొమ్ము తిరిగి వస్తుందో రాదోనన్న మానసికక్షోభతో, మనోవేదనతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులు ఊబిలో కూరికిపోయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, వై.కే .రాజు, కె.పాల్, బాబి, మోహన్ ప్రసాద్, వీర్రాజు, రాజేశ్వరి, వీర వేణి తదితర ఏజెంట్స్ అండ్ బాధితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *