fbpx

సర్దు “పోట్లు” తప్పవా…?

Share the content

తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరితే చాలా సీట్లలో సర్దుబాట్లు తప్పకపోవచ్చు. అయితే కీలకమైన నేతలు ఉన్నచోట ఇరు పార్టీల అధినేతలు కూడా పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. అలాంటి సీట్లలో కచ్చితంగా కీలకమైన చర్చలు సాగే అవకాశం ఉంది. దీనిలో ముందు వరుసలో తెనాలి నియోజకవర్గం కనిపిస్తోంది. తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీలో ఉంటానని ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫునుంచి ఆలపాటి రాజా కూడా పోటీలో ఉంటానని చెప్పడం ఇప్పుడు ఆసక్తిగా మారుతుంది. రెండు పార్టీలకు కీలక నేతలు కావడంతో పాటు రెండు పార్టీలకు ప్రధానమైన సీటు కావడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరితే ఎవరు పోటీలో ఉంటారు పోటీలో ఉన్న వారికి మిగిలిన వారు ఏ విధంగా సహాయం చేస్తారు అనేది కూడా ప్రధానం కానుంది. అయితే దాదాపు జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ ఎక్కడ పోటీలో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇతర సీట్లలో కూడా..

పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ తరఫున కందుల దుర్గేష్ ప్రజల్లో తిరుగుతూ వారితో మమేకమయ్యారు. ఇక్కడి నుంచి టిడిపి సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది టిడిపి సిట్టింగ్ సీటు. కచ్చితంగా ఈ సీటు తమకు కావాలని జనసేన పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు టిడిపి సిట్టింగ్ సీట్ ను వదులుకొని గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎక్కడికి పంపుతుంది అన్నది కూడా కీలకం. విజయవాడ పశ్చిమ సీటు కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది. ఇక్కడి నుంచి బీసీ నేత పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లోను బరిలోకి దిగి 20 వేలకు పైగా ఓట్లను సాధించారు. దీంతోపాటు కీలకమైన నేతగా కొనసాగుతున్నారు. అయితే ఈ సీట్ నుంచి బుద్ధ వెంకన్న లేదా నాగుల్ మీరా బరిలో దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బుద్ధ వెంకన్న విజయవాడ వెస్ట్ సీట్ మీద ఆశలు పెట్టుకున్నారు. గతంలోనూ చంద్రబాబు బుద్ధ వెంకన్నకు హామీ ఇచ్చారు. దీంతో విజయవాడ వెస్ట్ సీట్ విషయంలో కూడా ముడి పడే అవకాశం ఉంది. అవనిగడ్డ విషయంలోనూ మండలి బుద్ధ ప్రసాద్ ఇప్పటికే తాను బరిలో నిలుస్తానని టిడిపి తరఫున టికెట్ తనకే కేటాయిస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడి నుంచి కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పోటీలో నిలుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా లెక్కకు మించి కొన్ని సీట్ల విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య చివరి దశలో సర్దుబాట్లు తప్పకపోవచ్చు కానీ తీవ్ర విభేదాలు బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటినీ దాటుకుని రెండు పార్టీల నేతలు ఎలా కలిసి ఎన్నికలకు వెళ్తారు అన్నది ఇప్పటికిప్పుడే తేలే అంశం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *