fbpx

ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు.

Share the content

విజయవాడ లో విజయవంతంగా సాగిన జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంగ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు జనసేన – తెలుగుదేశం పార్టీలు పూర్తి స్థాయిలో కలసి పని చేయాలని నిర్ణయించాయి. పార్టీల్లోని కీలక నాయకులే కాకుండా ఇరు పార్టీల అనుబంధ విభాగాలు సైతం కలసి పని చేయాలని తీర్మానించాయి. ఒక వైపు ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేక పాలసీలపై పోరాట కార్యక్రమాలపై ఉధృతం చేయాలని జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. గురువారం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో జరిగిన జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ రెండో సమావేశంలో పలు కీలక అంశాలపై నాయకులు చర్చించారు. సుమారు 3 గంటలకు పైగా జరిగిన సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరగడంతో పాటు రెండు పార్టీల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ సభ్యులంతా హాజరై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో చర్చించిన అంశాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెంనాయుడు మీడియాకి వివరించారు. సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.1. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు ఇక మీదట హోటల్స్ లో ఉండవు. ఇరు పార్టీల కేంద్ర కార్యాలయాల్లోనే సమావేశాలు జరపాలని నిర్ణయించారు. వచ్చే మూడో సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో జరగనుంది. తదుపరి సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుతారు. ప్రతి 15 రోజులకు ఒక సమావేశం జరుగుతుంది. సమకాలీన అంశాలు, పోరాటాలు, కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.2. గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఇరు పార్టీలు సంయుక్త కార్యచరణతో ముందుకు వెళ్తాయి. పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న అనుబంధ విభాగాలన్నీ ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. 3. ఉమ్మడి జిల్లాగా గతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తీరుగానే ఈ నెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. 175 నియోజకవర్గాల్లో ఏ రోజు ఏ నియోజకవర్గం సమావేశం జరపాలన్నది త్వరలో నిర్ణయం తీసుకుంటాం. 4. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రత్యేకంగా ఒక కమిటీ నియమించాలని తీర్మానించారు. జనసేన పార్టీ నుంచి ముగ్గురు, తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురితో ఈ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ పని చేస్తుంది. ఇప్పటికే భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ప్రచారం చేస్తున్న అంశాలకు జనసేన పార్టీ ఇచ్చిన హామీలను చేర్చి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేస్తారు. దీనికి ఇరు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నిర్ణయించారు. 17వ తేదీ నుంచి ఉమ్మడి మేనిఫెస్టోపై గడప గడపకూ ప్రచారం ఉంటుంది.5. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేయడానికి నిర్ణయించారు. దీనిలో భాగంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలను గుర్తించి, విడతల వారీగా పోరాటం ఉంటుంది. ప్రజల సమస్యలను బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి పోరాటాలను ఉపయోగించుకోవాలి. మొదటిగా రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన కరవు సమస్యపై పోరాడి రైతులకు అండగా ఉండాలని నిర్ణయించారు. పంట నష్టపోయిన వారికి ఇన్ పుట్ సబ్సిడీ ద్వారా సాయం అందేలా పోరాటం చేస్తాం. పంటల బీమా విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.6. రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్న రోడ్ల సమస్య, నాసిరకం మద్యం, కరెంటు బిల్లుల బాదుడు, ఇసుక కొరత వంటి కీలక సమస్యలపై ప్రజల్ని చైతన్యవంతం చేసేలా ప్రజల మద్దతుతో పోరాటాలు చేస్తాం. ప్రజా సమస్యల్లో మొదటిగా రోడ్ల సమస్యపై 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల నాయకులు, కార్యాకర్తల పోరాటం ఉంటుంది.

7. వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు అధికమయ్యాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా వర్గాలపై దమనకాండ సృష్టిస్తున్నారు. చెప్పడానికి వీలు లేనంతగా దాడులు జరుగుతున్నాయి. దీనిపై ఆయా సామాజికవర్గాల సంఘాలు, నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. పార్లమెంటు పరిధి ఒక యూనిట్ గా తీసుకుని రాజకీయాలకు అతీతంగా ఆయా సామాజికవర్గాల సంఘాల నాయకులు, పెద్దలను పలిచి వారి సమస్యలపై గొంతెత్తుతాం. వారి వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం.8. ఓటరు జాబితా పరిశీలన అనేది చాలా కీలకం. దీనిపై రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలి. ప్రతి ఓటును పరిశీలించి లోపాలు ఉంటే తెలియజేయాలి. దీనిపై ప్రత్యేక డ్రైవ్ ను రెండు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఎన్నికల్లో విపరీతమైన అక్రమాలు చేసేందుకు, విపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు కలసికట్టుగా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించాం.9. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వివిధ వర్గాలపై కక్ష కట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా వారిపైనే ఎదరుదాడికి దిగుతోంది. వైసీపీలో దాడులకు గురైన అన్ని వర్గాలకు అండగా నిలుస్తాం. వారి సమస్యలను మానవతా దృష్టితో విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. 10. స్థానిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కేంద్ర నిధులను పక్కదోవ పట్టించారు. దోపిడీ దొంగ మాదిరి ముఖ్యమంత్రి లోకల్ బాడీల నిధులను తినేస్తున్నారు. దీనిపై ఉమ్మడిగా స్థానిక సంస్థలను బలోపేతం చేసే నిర్ణయాలను భవిష్యత్తులో తీసుకుంటాం. స్థానిక సంస్థలకు అండగా నిలబడతాం. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.11. వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు అధోగతి పాలైంది. వైసీపీ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ గాని, ఉద్యోగాల కల్పన గాని లేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభలకు గాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు గాని యువత బ్రహ్మరథం పట్టారు. అలాంటి యువతకు జనసేన-తెలుగుదేశం పార్టీలు అండగా నిలుస్తాయి. వైసీపీ పాలనలో ధగా పడిన యువతకు తగిన విధంగా సాంత్వన కలిగించే నిర్ణయాలు ఉంటాయి. దీనితో పాటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు ఉంటాయి. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు. దీనిపై భవిష్యత్తులో తగిన విధంగా నిర్ణయం తీసుకుంటాం అంటూ అచ్చన్న నాయుడు మీడియాకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *