fbpx

వాలంటీర్లు వ్యవహారంలో పవన్ పాస్

Share the content

జనసేన అధినేత వాలంటీర్లు మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి మింగుడు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో కీలకమైన సమాచారాన్ని సేకరించి పూర్తిగా ఎన్నికల్లో దీన్ని వాడుకోవాలని చూసిన వైసీపీకి పవన్ కళ్యాణ్ చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆత్మ రక్షణ ధోరణిలో వైసీపీ పడినట్లు కనిపిస్తోంది. దీటుగా సమాధానం కూడా చెప్పేందుకు ఎవరు ముందుకు రాకపోవడం విశేషం. కచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనంలో కొన్ని సందేహాలను పుట్టించాయి అని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు వాలంటీర్ ఎంత చెబితే అంతా అన్నట్లు ఉండే ప్రజల్లో ఈ వ్యాఖ్యలు కచ్చితంగా మార్పులు తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకేసారి వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా వైసీపీకి ఏం చేయాలో అంతు బట్టలేని స్థితిలోకి నెట్టేసాయి.

కీలక విషయాలు ఎవరు చెప్తున్నారు

ఏలూరు సభలో చివరి నిమిషంలో వాలంటీర్లు విషయాన్ని బయటపెట్టిన పవన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని మొదట్లో రాజకీయ నిపుణులు భావించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరకు తీసుకువెళ్లి అందిస్తున్న వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా జనసేన పార్టీకి ప్రతికూలంగా మారుతాయని మొదట్లో అనుకున్నారు. అయితే తర్వాత రోజుల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద సమాచార సేకరణ మీద విడమర్చి ప్రజలకు చెప్పడం, ముఖ్యంగా మహిళల అదృశ్యం వెనుక సమాచార సేకరణ అనేది కీలకంగా పనిచేస్తుందని చైతన్య పరచడం కచ్చితంగా ఇప్పుడు ప్రజల్లో ఒక ఆలోచనను రేకెత్తించింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం అంతా హైదరాబాదులోని ఓ కార్యాలయంలో నిక్షిప్తం అయి ఉంటుందని అక్కడున్న సిబ్బందికి జీతాలు ఎవరు ఇస్తున్నారని ఆ సమాచారం బయటకు వెళితే వచ్చే విపత్తు పెద్దగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దీనిపై చర్చ మొదలైంది. దీనిని దీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీకి తగిన ఆత్మరక్షణ సమాచారం లేకపోవడం కనీసం వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా ఏం చెప్పాలి అనే దానిమీద స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు వైసీపీ దీనిని కక్కలేక మింగలేక సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ మీద గ్రామస్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి మంత్రుల వరకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. వాలంటీర్ల ద్వారా సేవలందించడంతో తమ పరిధిలోకి ప్రజలు రావడం లేదని కనీసం తమను పలకరించడం లేదని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. దీనికి జోడిస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీలోని వర్గంలో ఆనందం కూడా కలిగిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా పూర్తిగా పని చక్కబెట్టవచ్చు అనుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు దీనిపై సమాధానం చెప్పవలసిన పరిస్థితిని పవన్ కళ్యాణ్ తీసుకువచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *