fbpx

హస్తం కొత్త ఎత్తుగడ

Share the content

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తిస్థాయి బలంగా ఉన్న పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోతే తెలంగాణలో సైతం అంతంత మాత్రమే నిలబడింది. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఊపు మీద కనిపిస్తోంది. సీనియర్లు అందరినీ ఏకీకృతం చేసి అధికారం చేపట్టేందుకు, సాధ్యమైనంత సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఖమ్మంలో నిర్వహించిన రాహుల్ సభకు మంచి జనాదరణ లభించడంతోపాటు నాయకుల్లోనూ ఒక రకమైన ఉత్తేజం కనిపించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు అర్థమవుతుంది.

ఇదే వ్యూహంతో ముందుకు..

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నే ప్రధాన కారణం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా భావించారు. కలిసి ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టిన పాపానికి కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యమే చెల్లించింది. అయితే దశాబ్ద కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనల్లో కచ్చితంగా మార్పు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు ప్రధానమైన పార్టీలు బిజెపికి అనుకూలంగా ఉన్నాయని, బిజెపి ఎంత చెబితే అంతా అన్నట్లు ఆ మూడు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అవసరం కచ్చితంగా ఉందని భారీగా వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసే వ్యహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ సైతం ఆంధ్ర ప్రదేశ్లో సుమారుగా రెండు నుంచి మూడు సభలు భారీగా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ దానికి కట్టుబడి ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారపక్షంతో పాటు విపక్షాలు సైతం బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని అందుకే ఆంధ్రప్రదేశ్లో ఏ పని కావడం లేదని విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పడంతో పాటు కేంద్రం చేతిలో మూడు పార్టీలు కీలుబొమ్మలుగా మారాయని కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ కోరే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు కొత్త వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి, ఆంధ్రప్రదేశ్లో బలంగా మారడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు అండగా నిలిచిన దళితులు మైనారిటీలు పూర్తిగా వైఎస్ఆర్సిపి వైపు వెళ్లారు. వారిని సైతం మళ్లీ కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహాలు కూడా రాహుల్ గాంధీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు మూడు నెలల్లో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటన పూర్తిగా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నది ఖరారు కానుంది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చి జిల్లాల వారీగా కూడా ప్రచార కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించడానికి చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం కూడా హోదా ఇచ్చేది కాంగ్రెస్ తెచ్చేది కాంగ్రెస్ అని బలంగా నినదించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *