fbpx

నెల్లూరు పెద్ద యాదవ్ ఎవరు??

Share the content

ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటే వైసీపీ.. జగన్ పరమ భక్తుడు ఎవరంటే అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపించేది. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రి పదవి చేపట్టి, వైయస్ జగన్ మొదటి క్యాబినెట్ లోనే అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టడం నెల్లూరు జిల్లాలోనే కాకుండా, బీసీ వర్గాల్లోనూ ఆయన పరపతిని పెంచింది. అయితే రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు యాదవ వర్గం నుంచి అవకాశం కల్పించిన జగన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పక్కన పెట్టారు. దీంతో సామాజిక సమీకరణాలకు ఆయన తలొగ్గక తప్పలేదు. అయితే మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తీరులోనూ అలాగే ఆయనకు వైసిపి అధిష్టానం ఇస్తున్న ప్రాధాన్యం పూర్తిగా తగ్గింది. ఆ తరువాత నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడటం, ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీ వైపు చూడడం కూడా జరిగిపోయింది. ఈ పరిణామాలు నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారతారు అన్న ప్రచారం, ఆయనకు దీటుగా వైసీపీ పెద్దలు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ను ప్రోత్సహించడం ఎక్కువైంది. నువ్వా నేనా అనే స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ వర్గం రూప్ కుమార్ యాదవ్ వర్గం నెల్లూరు సిటీలో సొంత పార్టీలోనే తొడలు కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారతారు అన్న ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా బలంగా చేయడం విస్తు గొలుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ప్రత్యక్షంగా అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగి తన ప్రాణం పోయేంతవరకు వైసీపీలోనే ఉంటానని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రూప్ కుమార్ వెనుక ఉన్నది ఎవరు?

ఆర్థికంగానూ సామాజికంగానూ బలవంతుడిగా ఉన్న రూప్ కుమార్ యాదవ్ ను అనిల్ కుమార్ యాదవ్ కు సమజోడీగా పార్టీలో ప్రోత్సహించడం వెనుక వైసీపీ నాయకులే ఉన్నారు. ముఖ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా కొనసాగుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ ను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారతారు అన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లిన వ్యక్తి కూడా ఆయనే. దీంతోనే అనిల్ కుమార్ యాదవ్ స్వీయ రక్షణలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. అనిల్ కుమార్ కు కూడా చైర్మన్ ద్వారకానాథ్ తోను పడని పరిస్థితి నెలకొంది. రూప్ కుమార్ యాదవ్ పూర్తిస్థాయిలో నెల్లూరు నగరపాలక సంస్థ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. దీంతో కార్పొరేటర్లు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ తో మాట్లాడని పరిస్థితి నెలకొంది. మెల్లమెల్లగా వైసీపీలోనే తన వ్యతిరేక వర్గం బలం పుంజుకోవడం, వైసిపి సోషల్ మీడియా నుంచే అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారతారు అన్న ప్రచారం వస్తున్న నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ బయటికి వచ్చి దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూప్ కుమార్ కు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రాధాన్యం ఇచ్చి, అనిల్ కుమార్ ను పక్కన పెట్టే ఆలోచన కూడా వైసిపి అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ రాజకీయాలను చక్కబట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలోకి దిగుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు రూప్ కుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ భేటీ తర్వాత నెల్లూరు రాజకీయాల్లో ఏం జరుగుతుంది అన్నది బయటికి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *