fbpx

విశ్వరూప్ ను వదిలించుకోవాలని

Share the content

మంత్రి పినిపే విశ్వరూపం పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం వైసిపి మీడియా నుంచే రావడం విశేషం. సొంత పార్టీ నేతను కావాలనే అధికార పార్టీ సోషల్ మీడియా బదనాం చేస్తోంది అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఓ ప్రణాళిక ప్రకారమే విశ్వరూపం వదిలించుకునే పనిలో వైసిపి ఉందని, ఆ ప్రణాళికలో భాగమే వైసీపీ సోషల్ మీడియా విశ్వరూప్ పార్టీ మారుతున్నారు అన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తోంది అన్నది రాజకీయ వర్గాల మాట. పినిపే విశ్వరూప్ మీద ఈ తరహా దాడి చేయడం వెనుక ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్నది నా మనసులోని మాట కూడా అనడంతోనే అసలు చిక్కు వచ్చి పడింది. వ్యంగ్యంగా మాట్లాడిన మాటలను వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకోవడమే కాకుండా విశ్వరూప్ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని సర్వేలు రావడంతో ఇప్పుడు ఆయనను పక్కకు తప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అమలాపురం అల్లర్ల విషయంలో విశ్వరూప్ తీరుతో వైసీపీకి నష్టం

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో అమలాపురం అల్లర్లు రాజుకున్నాయి. ముఖ్యంగా దళిత వర్గాలకు అలాగే దళిత ఏతర వర్గాలకు పూర్తిస్థాయి గ్యాప్ వచ్చేలా అప్పట్లో అల్లర్లు సృష్టించాలని ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లారు. ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఆ అల్లర్లలో మంత్రి విశ్వరూప్ ఇంటిని పూర్తిగా తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని జాతీయస్థాయి వరకు తీసుకువెళ్లి పూర్తిగా లబ్ధి పొందాలి అని భావించిన అధికార పక్షానికి మంత్రి తీరుతో కక్కలేక మింగలేక అన్నట్లు వ్యవహారం తయారైంది. కనీసం విశ్వరూప్ అల్లర్ల విషయంలో గట్టిగా మాట్లాడకపోవడం ఆందోళనకారుల తీరును తప్పు పట్టకపోవడం జనసేన పార్టీని తిట్టకపోవడంతో అప్పట్లోనే విశ్వరూప్ తీరు మీద వైసీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని విశ్వరూప్ ను వైసీపీ పెద్దలు మందలించారు. కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీ బలం పుంజుకోవడంతో ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులను ఇరికించి సామాజిక వర్గాల వారీగా విడదీస్తే కచ్చితంగా వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అని, దానికి తగినట్లుగా మంత్రి వ్యవహరించలేదు అన్నది పెద్దల కోపానికి అసలు కారణం.

ఇప్పుడు వ్యాఖ్యలతో మరింత రచ్చ

అమలాపురం అల్లర్లు తర్వాత జనసేన పార్టీ మీద సున్నితంగా వ్యవహరించిన మంత్రి విశ్వరూప్ తీరును అప్పట్లోనే వైసిపి పెద్దలు ఖండించారు. అంతర్గత సమావేశాల్లోనూ మంత్రి తీరును తప్పుపట్టారు. అదే పందాలో వెళితే పార్టీని ముందుకు నడిపించలేమని బలం పుంజుకుంటున్న జనసేనకు చెక్ పెట్టాలి అంటే కచ్చితంగా ఎదురు దాడి చేయాలి అని ఎంత చెప్పినా మంత్రి సరైన రీతిలో స్పందించలేదు. తాజాగా తిరుమల దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులే కాదు నేను కూడా కోరుకుంటున్నానని దైవ సన్నిధిలో చెప్పడంతో వైసిపి పెద్దలు ఆయన మీద చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉండడంతో పాటు కచ్చితంగా విశ్వరూప్ పార్టీ మారనున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరందుకుంది. కావాలనే వైసీపీ సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని ఎక్కువ చేసింది. వచ్చే ఎన్నికల్లో మంత్రిని పక్కన పెట్టాలి అని భావిస్తున్న వైసీపీ ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చి పార్టీ వర్గాల్లో సింపతి కోసం ప్రయత్నిస్తోంది. వైసీపీకి అనుకూలంగా ఉండే వర్గాల్లో మంత్రి పార్టీ మారుతున్నారు అన్న భ్రమ కల్పించి వారి మద్దతు వైసీపీకి పోకుండా జాగ్రత్తపడాలి అన్నది వైసిపి సోషల్ మీడియా అసలు ఉద్దేశం. విశ్వరూప్ అసలు జనసేన పార్టీ నాయకులతో కానీ శ్రేణులతో గాని టచ్ లో లేరు. అసలు ఎప్పుడు ఈ మధ్యకాలంలో జనసేన పార్టీకి అనుకూలంగా మాట్లాడింది లేదు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు జోరుగా పార్టీ మారుతారు అన్న ప్రచారం వెనుక కచ్చితంగా సొంత పార్టీ నేతల ప్రమేయమే దాగి ఉంది అన్నది మంత్రికి తెలుసు… అయితే ఈ చర్యలు ఎటు నుంచి ఎటు వెళ్తాయో భవిష్యత్ నిర్ణయించునుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *