fbpx

పోలవరం ప్రాజెక్ట్ పై అంత గప్ చుప్!..

Share the content

ప్రతిష్ఠాత్మకమైన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో రూ.81 కోట్ల ఖర్చుతో చేసిన నిర్మాణం కూలిపోతే చిన్న విషయమా..? దానికి ప్రాధాన్యం లేదా..? సాగునీటి ప్రాజెక్టు ప్రవాహాన్ని నియంత్రిస్తూ, పారుదల సాఫీగా సాగడానికి అవసరం అయ్యే పోలవరం గైడ్ బండ్ నిర్మాణం కూలిపోయిన విషయాన్ని ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది..? దీనిలో అసలు మతలబు ఏమిటి..? పోలవరం నిర్మాణ సంస్థ మేఘా సొంతంగా డిజైన్ చేసి కీలకమైన నిర్మాణం కూలిపోతే చర్యలు లేవెందుకు..? అసలు మేఘాను దీనిపై వివరణ కోరారా..? అనే వేల ప్రశ్నలకు వైసీనీ ప్రభుత్వం దగ్గర మౌనమే సమాధానం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఆది నుంచి వైసీపీ ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. 2021 ఖరీఫ్ నాటికే పోలవరం ద్వారా నీటిని అందిస్తామని చెప్పిన వైసీపీ పాలకులు, దాన్ని పలుమార్లు వాయిదా వేశారు. నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన నాయకులు, నిధులు తేలేక ఎత్తు విషయంలో రాజీ పడిపోయారు. తాజాగా పోలవరం కీలక నిర్మాణం కూలిపోయినా దాన్ని ప్రజలకు తెలియకుండా చేసేందుకు నానా తంటాలు పడటం వైసీపీ నిర్లక్ష్య విధానానికి నిలువటద్దం.
• నిర్మించి ఏడాది కాకముందే పోలవరంలోని కీలకమైన నిర్మాణం గైడ్ బండ్ కుంగిపోయింది. గోదావరి ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు, జలాశయంలో నీటి నిల్వకు వీలుగా స్పిల్ వే రక్షణ కోసం గైడ్ బండ్ నిర్మించారు. స్పిల్ వేపై ఒకవైపే అధిక ఒత్తిడి పడకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. రిటైన్ వాల్ కం గైడ్ బండ్ డిజైన్, నిర్మాణ బాధ్యతలన్నీ మేఘా ఇంజినీరింగ్ చేసింది. ఇప్పుడు గైడ్ బండ్ కుంగిపోవడాన్ని ఈ సంస్థే బాధ్యత తీసుకోవాలన్నది ఇంజినీరింగ్ నిపుణుల మాట.


• గైడ్ బండ్ నిర్మాణం మొత్తం మొదటి నుంచి చేపట్టాలని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతుంటే, ఇదో చిన్న విషయమని సీఎం చెప్పడం విశేషం. ప్రాజెక్టు నిర్మాణాల్లో చిన్న చిన్న సమస్యలు సహజమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా వివరించలేదు. మేఘా ఇంజినీరింగ్ ను వెనకేసుకొచ్చినట్లే సీఎం మాట్లాడారు తప్పితే, అసలు ఏం జరిగిందనే విషయాలను బయట పెట్టలేదు.
• పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన గైడ్‌బండ్‌ కుంగిపోవడాన్ని.. నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ వైఫల్యంగానే పరిగణించాలని నిపుణులు అంటున్నారు. ప్రవాహ వేగం ఒకవైపే పడకుండా నియంత్రించడం, ప్రాజెక్టు స్పిల్‌వే రక్షణకు కీలకమైన గైడ్‌బండ్‌ ఆకృతులు రూపొందించి, నిర్మించింది మేఘా సంస్థేనని గుర్తుచేస్తున్నారు. రూ. 81 కోట్లు వెచ్చించిన నిర్మాణం కుంగిపోతే… కాంట్రాక్ట్ కంపెనీని వెనుకేసుకొస్తూ కుంగిపోవడం చిన్న సమస్యమేనని సీఎం అనడం దారుణమంటున్నారు. ఎందుకు కుంగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా… పీపీఏ, సీడబ్ల్యూసీకి నివేదించామని, వాళ్లే తేలుస్తారని చేతులు దులుపుకోవడం కూడా సరికాదంటున్నారు.


ఏమిటీ గైడ్ బండ్..?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలా విభిన్నం. ఇప్పటికే స్పిల్ వేతో పాటు గోదావరి సహజ మార్గంలో 44 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించారు. దీంతో నది సహజ మార్గం నుంచి అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే మీదుగా వరద ప్రవాహం సాగుతోంది. గోదావరి ప్రవాహ తీరును పరిశీలించిన నిపుణులు స్పిల్ వే ఎడమ ఫ్లాంకు వైపున ప్రవాహ వేగం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇక్కడ సుడిగుండాలు ఏర్పడవచ్చని, ఇది ప్రాజెక్టు దీర్ఘకాలిక మన్నికపైనా ప్రభావం చూపుతుందని తేల్చారు. త్రీడీ నమూనాలు రూపొందించి పరిశీలించిన పూణే కేంద్ర జల విద్యుత్ కేంద్ర నిపుణులు స్పిల్ వే ఎడమ ఫ్లాంకు వైపున సెకనుకు 13.6 మీటర్ల వేగంతో ప్రవాహం ఉందని గుర్తించారు.
• స్పిల్ వే మధ్యలో ప్రవాహ వేగం సెకనుకు 9.2 మీటర్లు ఉండట ప్రమాదకరమని నిపుణులు తేల్చారు. వరద సాఫీగా సాగాలంటే స్పిల్ వే వద్ద ఏం చేయాలనే దానిపై సిఫార్సులు చేశారు. అప్రోచ్ ఛానెల్ మౌత్ వద్ద 450 మీటర్ల వెడల్పు తవ్విన మార్గాన్ని , 550 నుంచి 600 మీటర్లకు పెంచాలని సూచించారు. స్పిల్ వే ఎడమ వైపు ఎగువన, అప్రోచ్ ఛానెల్ ఎడమ వైపున 500 మీటర్ల మేర గైడ్ బండ్ నిర్మించాలని చెప్పారు. దీనివల్ల స్పిల్ వే ఎడమ ఫ్లాంక్ ప్రాంతంలో భారీ సుడిగుండాలు నివారించవచ్చని, ప్రవాహ వేగం కూడా తగ్గుతుదని నిపుణులు చెప్పారు. గైడ్ బండ్ నిర్మిస్తే అప్రోచ్ ఛానెల్ వద్ద వరద ప్రవాహ వేగం సెకనుకు 4 మీటర్లకు తగ్గుతుందని అంచనా వేసి, దీని నిర్మాణానికి అంకురార్పణ చేశారు. పోలవరం ప్రాజెక్టు రక్షణకు సైతం ఈ నిర్మాణం కీలకం కావడంతో దీనికోసం రూ.81 కోట్లు వెంటనే కేటాయించారు.
• కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రం సూచనల తర్వాత మేఘా ఇంజినీరింగ్ ఆకృతులు సిద్ధం చేయించింది. సీడబ్య్లూసీ ఆమోదం తర్వాత పనులు చేపట్టింది. వరద ప్రవాహ వేగం వైపున 1.5 మీటర్ల మందంతో డయా ఫ్రం వాల్ నిర్మించారు. మైనస్ 5 మీటర్ల నుంచి ప్లస్ 25 మీటర్ల ఎత్తు వరకు దీనిని నిర్మించారు. అంటే 500 మీటర్ల పొడవునా నదీ ప్రవాహం ఉండే వైపున భూగర్భం నుంచి 25 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మించారు. దిగువన 117.28 మీటర్లు, ఎగువన 6 మీటర్ల వెడల్పును ఉంచారు. నిర్మాణ సమయంలో అక్కడున్న భూ భౌతిక పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే, పరీక్షల తర్వాతే నిర్మాణం చేపట్టామని కాంట్రాక్టరు చెబుతున్నా, బండ్ కూలిపోవడానికి నిర్దుష్ట కారణం మాత్రం తెలియడం లేదు. 4
• ఇప్పుడు ఈ కట్టడాన్ని మొదటి నుంచి నిర్మించాలా.. లేక కుంగిపోయిన వరకు సరిచేస్తే అయిపోతుందా అన్న దానిమీద స్పష్టత లేదు. రిటైనింగ్ వాల్ ఎంత మేర దెబ్బతింది..? కుంగిన ప్రాంతంలో పరిస్థితి ఏంటీ..? భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమస్య వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? అన్నది కూడా అంతుపట్టడం లేదు. స్టోన్ కాలమ్స్ తో చేసిన పనులు వల్ల, మట్టి సాంద్రత పెంచే పనుల్లో లోపం వల్ల గైడ్ బండ్ కుంగిపోవడానికి అవకాశం ఉందనేది విశ్రాంత ఇంజినీరింగ్ నిపుణుల మాట. రిటైనింగ్ వాల్ నిర్మించడానికి తీసిన లోతు సరిపోకపోయి ఉండవచ్చని, భూమిలో కేవలం మైనర్ 5 మీటర్ల లోతు సరిపోకపోవడం వల్ల కూడా ఇది జరిగి ఉండవచ్చనేది తెలుస్తోంది.


• ఇటీవల పోలవరం సమీక్ష చేసిన ముఖ్యమంత్రి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం బయటకు చెప్పలేదు. పోలవరం నిర్మాణం విషయంలోనూ, కూలిన గైడ్ బండ్ విషయం మీద చర్చ జరిగినా దాన్ని ప్రజలకు బహిర్గతం చేయకపోవడం విశేషం. అసలు పోలవరం ప్రాజెక్టు పురోగతి మీద, జరుగుతున్న పనులు, నిర్మాణాల మీద ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం తప్పించుకునే విధానాన్ని అవలంబించడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *