fbpx

బదిలీలు జరిగిన ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు: సజ్జల రామకృష్ణ రెడ్డి

Share the content

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా పూర్తిగా విఫలమయ్యారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఎన్నికల కమిషనే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. తక్షణమే రాష్ట్రంలో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌ ముగిశాక కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భావించి… రాజకీయ కక్షతో టీడిపి నేతలు హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు.టిడిపి దాడులు చేస్తున్నా.. పోలీసులు స్పందించకుండా చోద్యం చూశారని విమర్శించారు. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, పల్నాడు, అనంతపురం ప్రాంతాల్లో పెద్దయెత్తున టిడిపి హింసకు పాల్పడిందన్నారు. రాజకీయ కారణాలతోనే టిడిపి ఫిర్యాదులు చేయగానే బదిలీలు జరిగాయని అన్నారు. బదిలీ జరిగిన జిల్లాల్లోనే హింస చోటుచేసుకుంటోందని అన్నారు. మొత్తం 29 మంది అధికారులను టిడిపి బదిలీ చేయించిందని విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌.. బిజెపి, టిడిపి ఫిర్యాదులకు అనుగుణంగా పనిచేసిందని విమర్శించారు. పోలింగ్‌కు ముందు అధికారులను మార్చడంతో కొత్తగా వచ్చినవారు జిల్లాపై అవగాహన తెచ్చుకోలేకపోయారని, అందుకే అసాంఘిక శక్తులు విజృంభించాయని తెలిపారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు చెప్పారని ఏకంగా డిజిపిని కూడా బదిలీ చేయించారని పేర్కొన్నారు.ఎన్నికల కౌంటింగ్‌ రోజు మరింత హింసకు టిడిపి కుట్ర చేసే అవకాశం ఉందని..ఎన్నికల కమిషన్‌ మేల్కోని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *